TPCC Chief Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెడుతున్న ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతున్నాయా..? అనే ప్రశ్న ఉదయిస్తే..! రాష్ట్రంలో బలంగా ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడతారని రేవంత్ భావించారు. అందులో భాగంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ లను నేరుగా కలిసి చర్చించారు. రేవంత్ భేటీ సందర్భంగా నేతలు సైతం సానుకూలంగా స్పందించారు. తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఆయా నేతలు కాంగ్రెస్‌కు చెయ్యి ఇచ్చినట్లేనా..? ఇంతకీ రేవంత్ ఎఫర్ట్ ఎక్కడి దాకా వచ్చింది.?
కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీచీఫ్‌గా తనను ప్రకటించిన నాటి నుంచి పార్టీ బలోపేతం మీద ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. పార్టీలో కొనసాగుతూ సైలెంట్‌గా ఉంటున్న సీనియర్లు, బలమైన నేతలను స్వయంగా వాళ్ల నివాసాలకు వెళ్లి యాక్టివ్ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయా నేతలను భాగస్వామ్యం చేయగలిగారు. అలాగే పార్టీలోకి వచ్చి వెళ్లిపోయిన వారిని సైతం తిరిగి తెచ్చుకునేందుకు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి రెండు సార్లు భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం … రేవంత్ నాయకత్వాన్ని సమర్థించారు. కేసీఆర్‌ను ఢీ కొట్టలంటే రేవంత్ సమర్థుడంటూ కితాబిచ్చారు.
తెలంగాణలో బలమైన నేతలను తన వైపుకు తిప్పుకునే పనిలో భాగంగా మాజీమంత్రి టి.దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లారు. దేవేందర్ గౌడ్ ప్రస్తుతం ఆనారోగ్య కారణాల వల్ల యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నా.. వాళ్ల కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. వీరేందర్‌ను కాంగ్రెస్‌లోకి లాగే ప్రయత్నాల్లో భాగంగా రేవంత్.. వారి నివాసానికి వెళ్లి దేవేందర్ గౌడ్‌ను పరామర్శించారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇదిలా ఉంటే.. ఘర్ వాపసీలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వంటి నేతలు తిరిగి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. వీటితో పాటు తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్‌తో చర్చలు జరుగుతున్నాయని.. ఆయన కూడా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే టాక్ వినిపించింది.
అయితే వీటన్నింటికి భిన్నంగా ప్రస్తుత పొలిటికల్ సిట్యువేషన్ నెలకొంది. రేవంత్ చర్చల సందర్భంగా నేతలందరూ సానుకూలంగా స్పందిస్తున్నా.. కార్యాచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినా.. సెకండ్ డే వెంటనే అందుకు భిన్నంగా కాంగ్రెస్‌లో ఇప్పట్లో చేరడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలవాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్.. కూడా కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో భేటీ అయ్యారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెడుతున్న ఎఫర్ట్‌లో ఎక్కడో చిన్న గ్యాప్ వస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన చేస్తున్న ప్రయోగాలు వర్క్ అవుట్ కావడం లేదు. ఫైనల్‌గా రేవంత్ చేస్తున్న ప్రయోగాలు తాత్కాలికంగా సక్సెస్ కాకపోయినా.. భవిష్యత్తులోనైనా సక్సెస్ అవుతాయా.. లేదా అనేది చూడాలి.
Read also: TR : ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పంపిణీ వాయిదా, ‘నా బర్త్‌డే వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావొద్దు’ : కేటీఆర్