
హైదరాబాద్ : ఎన్నికల వేళ టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. ఉత్తమ్ అనుచరుడి కారులో రూ. 48లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ బీఎండబ్ల్యూ కారులో రూ.48 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా జూబ్లీ హిల్స్ నుంచి నల్గొండకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఉత్తమ్ కానీ.. పార్టీ వర్గాలు కాని స్పందించలేదు. కాగా, డబ్బులు ఎక్కడ డ్రా చేశారు.. దేని కోసం ఇంత మొత్తాన్ని తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.