ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై ఆర్జేడీ(RJD) అధినేత లాలూ ప్రసాద్(Lalu Prasad) తీవ్ర ఆరోపణలు చేశారు. 70 ఏళ్ల కిందట బ్రిటీష్ వారు భారత్ ను వదిలి వెళ్లారని, అయితే బీజేపీ రూపంలో మళ్లీ వచ్చారని వ్యాఖ్యానించారు. మోడీ(Modi) పాలనలో దేశం అంతర్యుద్ధం దిశగా పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల విషయంలో బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నట్టు అర్థమవుతుందన్నారు. అందుకే దేవాలయాలు, అల్లర్ల వంటి సున్నితమైన అంశాలను లేవనెత్తి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మరో వైపు యూపీ ఎన్నికల్లో తమ పార్టీ.. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి మద్దతు ఇస్తుందని లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు.
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై మాట్లాడుతూ.. మోడీ హయాంలో దేశం పౌరయుద్ధం దిశగా వెళ్తోంది. ద్రవ్యోల్బణం గురించి కానీ, పేదరికం గురించి కానీ వాళ్లు మాట్లాడటం లేదు. అయోధ్య, వారణాసి గురించి మాత్రమే మాట్లాడతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశా నిస్పృహల్లో బీజేపీ ఉంది. 70 ఏళ్ల క్రితం మన పూర్వీకులు బ్రిటిషర్లను ఈ దేశం విడిచివెళ్లేలా చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ రూపంలో వారు తిరిగి వచ్చారని లాలూ ప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు.
మరో వైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీలు, డీసీటీఈ విభాగంలోని కాలేజీలకు మూడు రోజుల సెలవు ప్రకటిస్తూ కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్.అశ్వత్థ నారాయణ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది.