తలైవా రజనీకాంత్ ఏర్పాటు చేయబోతున్న రాజకీయ పార్టీ విద్వేష రాజకీయాలు చేయకుండా ఆధ్మాత్మిక రాజకీయాలు చేస్తుందంటున్నారు రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్.. లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలు కలిసి పని చేయవంటే తాను ఒప్పుకోనని .. అలాంటి రాజకీయాన్ని రజనీకాంత్ చేసి చూపిస్తారని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 234 స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరున కొత్త పార్టీని రజనీకాంత్ ప్రకటిస్తారని, పార్టీ విధివిధానాలపై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నారని తమిళరువి మణియన్ అన్నారు. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయానికి ఏ మతంతోనూ సంబంధం లేదన్నారు. మహాత్మాగాంధీ ఇలాంటి రాజకీయాలనే తొలుత ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ప్రత్యర్థి పార్టీలపై అనవసరంగా విమర్శలు చేయమని, ఆ పార్టీల తప్పొప్పులను చెప్పమని అన్నారు. ప్రజలకు ఏం చేస్తామో, రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపడతామో వివరించి ప్రజల మనస్సులను గెల్చుకుంటామని తమిళరువి అన్నారు. ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని, కులమతాల గొడవలు లేకుండా అందరికీ సంక్షేమం అందించాలన్నది రజనీ లక్ష్యమని అన్నారు.