ఆయన వైసీపీ ఎంపీ.. కానీ తరచూ బిజెపి నేతలతో కనిపిస్తుంటారు. బిజెపి ఆఫీసులో దర్శనమిస్తూ వుంటారు. ఒక్కోసారి ఏకంగా ప్రధానమంత్రి సమీపంలోకి వెళ్ళి సరెండరైనంత పని చేస్తారు.. ఇదేంటయ్యా అంటే నియోజకవర్గం పనో.. ఢిల్లీలో నివాసం పనో.. అని చెప్పి తప్పించుకుంటారు. ఎస్..ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ వార్తలకెక్కుతున్నారు. వైసీపీలో వుంటారా? లేక బిజెపిలో జాయిన్ అవుతారా? అన్నదిప్పుడు పెద్ద చర్చ.
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఏళ్ళు కాకపోయినా రఘురామకృష్ణంరాజు పనిచేయని రాజకీయ పార్టీ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. టిడిపి వయా బిజెపి వయా వైసీపీ వయా బిజెపి వయా టిడిపి.. ఇలా రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ నుంచి ఎటెల్లారు అంటే టక్కున ఆన్సర్ చెప్పడం కష్టమే. ఒంటి మీదున్న షర్ట్‌ని తీసేసి వేరేది వేసుకున్నంత ఈజీగా పార్టీలు మారిపోయారు ప్రస్తుతం వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజు.
తాజాగా ప్రధానమంత్రికి ఈ ఎంపీ పార్లమెంటు ఆవరణలో తారసపడి వినయంగా విష్ చేస్తే.. నరేంద్ర మోదీ.. ఏకంగా.. ‘‘ రాజు గారు.. హౌ ఆర్ యు ? ’’ అన్నారట. మోదీ అంతటి నేత పేరు పెట్టి మరీ పలకరించడంతో ఎంపీ గారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారంట. విషయం అంతటితో ఆగితే ఆయన వార్తలకెందుకు ఎక్కుతారు? మోదీ పలకరించింది మొదలు రఘురామకృష్ణంరాజు.. బిజెపి నేతలతో తిరగడం మొదలుపెట్టారు. దాంతో ఆయన బిజెపిలో చేరడం ఖాయమని ప్రచారం మొదలైంది. అంతటితో ఆగని రఘురామకృష్ణంరాజు.. సోమవారం ఏకంగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దాంతో బిజెపి ఎంట్రీ ఇంకెప్పుడు? అని ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇదే ప్రశ్న ఆయన్ని అడిగితే.. అబ్బే అదేం లేదు.. ఢిల్లీలో నివాసం గురించి మాట్లాడేందుకు వచ్చానంటూ సన్నాయి నొక్కులు నొక్కారంట.
ఒకవైపు సుజనా లాంటి వారు వైసీపీ నేతలు తమతో టచ్‌లో వున్నారంటూ ప్రకటనలు చేస్తున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీలు బిజెపి నేతలతో అంటకాగడం వైసీపీ అధినేత జగన్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది. దాంతో ఢిల్లీలో వుండే వైసీపీ నేతలు, ఎంపీలు… విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిల అనుమతి లేకుండా కేంద్ర మంత్రులను, బిజెపి నేతలను కల్వవద్దని జగన్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. సో.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అని ఊరకనే అనరు కదా..!