బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడేక్కాయి. తొలి దశ ఎన్నికల ప్రచారానికి ఇక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ బహిరంగసభలో పాల్గొన్నారు. ససారామ్‌లోని బైదా మైదాన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే బీహార్ ఇద్దురు కుమారుల్ని కోల్పోయిందన్నారు. పేదలు, దళితుల పట్ల పోరాటం చేసిన రామ్‌విలాశ్ పాశ్వాన్ చివర వరకు తనతో ఉన్నట్లు చెప్పారు. పేదల కోసం బాబు రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడా పనిచేశారన్నారు. ఆ ఇద్దరికీ తాను నివాళి అర్పిస్తున్నట్లు తెలిపిన ప్రధాని.. దేశానికి త్యాగధనులను అందించిన గడ్డ బీహార్ అని వక్కాణించారు. అటు, గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో బీహారీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, భారతమాత కోసం వారు ప్రాణత్యాగం చేశారన్నారు. పుల్వామా దాడిలోనూ బీహారీ జవాన్లు నేలకొరిగినట్లు తెలిపారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు మోదీ చెప్పారు.
కొవిడ్19 పట్ల బీహార్ ప్రజలు పోరాడుతున్న తీరును ప్రశంసించారు ప్రధాని నరేంద్రమోదీ. మహమ్మారి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమన్నారు. రాష్ట్రాన్ని గతంలో రోగాల పాలు చేసిన వారిని మళ్లీ దగ్గరకు రానివ్వవదని బీహారీ ఓటర్లు కంకణం తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఒకప్పుడు బీహార్‌ను పాలించిన వాళ్లు, ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంపై కన్నేసినట్లు ఆరోపించారు. బీహార్‌ను వెనక్కి నెట్టిన వారిని ఎవరూ మరిచిపోవద్దు అన్నారు. గతంలో బీహార్ లో శాంతి భద్రతలు కరువయ్యాయన్న ప్రధాని.. అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. తమ ప్రభుత్వం కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని, అయితే అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్‌ను తెస్తామని విపక్షాలు అంటున్నాయని, అలాంటి పార్టీలు బీహార్‌లో ఎలా ఓట్లు అడుగుతున్నాయని ప్రధాని ప్రశ్నించారు. ఇది బీహారీలకు అవమానం కాదా, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి వెళ్తున్న బీహారీలను మోసం చేసినట్లేనన్నారు. బీహార్ ఇప్పుడు వేగంగా వికాసం దిశగా వెళ్తోందన్నారు. సీఎం నితీశ్ కుమార్‌కు.. యూపీఏ సర్కార్ ఎటువంటి సాయం చేయలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.