రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. ఈ మాట ఎందుకు పుట్టించారో తెలియదు గానీ… అధికారంలో ఏపార్టీ ఉంటే ఆపార్టీలోకి జంప్ అయ్యే నేతలను చూసినప్పుడు మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు బీజేపీలోకి జంపింగ్స్ అధికంగా సాగాయి. తాజాగా వైసీపీలోకి కూడా వలసలు వస్తుండటంతో ఆపార్టీలో ఆశ్రయం పొందే నేతల సంఖ్య పెరుగుతోంది.
మాల మహానాడు అధ్యక్షుడుగా కొనసాగిన జూపూడి ప్రభాకర్‌రావును గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అక్కడినుంచి 2014 ఎన్నికల తర్వాత కూడా ఆయన వైసీపీలోనే కొనసాగారు. తీరా కొద్ది కాలం తర్వాత జూపూడి పార్టీ మారి టీపీపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీ మారిన వెంటనే జూపూడికి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సైతం కట్టబెట్టారు చంద్రబాబు. ఇక అక్కడి నుంచి వైసీపీ అధినేత జగన్‌పై ఎంతగా విమర్శలు చేశారో తెలిసిందే. విద్యాధికుడైన జూపూడికి సహజంగానే వాక్చాతుర్యం ఎక్కువ. దాంతో తనకు పదవిని సైతం ఇచ్చి ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబును కీర్తించడంలో జూపూడికి తిరుగులేకుండా పోయింది. ఇక 2019 ఎన్నికల్లో హైదరాబాద్ కూకట్‌పల్లిలో జూపూడి డబ్బులు పంచారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వయంగా ఆయన కారును ఎన్నికల సమయంలో పోలీసులు పట్టుకుని కేసు కూడా నమోదు చేశారు. అంటే టీడీపీ కోసం జూపూడి చాలా కష్టపడ్డారు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై జూపూడి ఎన్నిరకాల విమర్శలు చేశారో కూడా తెలిసిందే. అటువంటి జూపూడి ప్రభాకర్‌రావు తాజాగా.. బ్యాక్ టు హోం అంటూ సొంతిగూటికి చేరున్నారు.
సీఎం జగన్ సమక్షంలో రాజమండ్రికి చెందిన నేత ఆకుల సత్యనారాయణతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందే చెప్పినట్టు మంచి వాక్పటిమ గల నేతగా పేరున్న జూపూడి.. మళ్లీ జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీలో పరిపాలన ఎంతో ఆశ్చర్యకరంగా సాగుతుందని, సీఎం జగన్‌ను చూస్తే క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రోను చూసినట్టుగా ఉందంటూ ఓ రేంజ్‌లో ఎత్తేశారు. సీఎం జగన్ తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలపై ప్రతిఒక్కరూ చర్చించాల్సిన అవసరం కూడా ఉందన్నారు జూపూడి. ఇక టీడీపీ నుంచి పార్టీ మారడంపై ఆయన చెబుతూ.. అవగాహన లేక టీడీపీలో చేరినట్టు తెలిపారు. అయితే జూపూడి ప్రభాకర్‌రావుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా అక్కున చేర్చుకోవడం వెనుక సామాజికవర్గ సమీకరణాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన ఓ సామాజిక వర్గ నేతగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ కారణంతోనే మాజీ సీఎం వైఎస్సార్.. జూపూడిని ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.
ఇక రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. గతంలో టీడీపీలో ఉంటూ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అప్పటి అనకాపల్లి ఎంపీ, ప్రస్తుత ఏపీ పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి వంటి ఎంతోమంది అప్పటివరకు టీడీపీలో కొనసాగి ఎన్నికల నాటికి వైసీపీ గూటికి చేరిపార్టీమారి కొత్త రాగం ఎత్తుకోవడం కూడా తెలిసిందే. అయితే రాజకీయ పునరావాసం కోసమే.. కొంతమంది అధికారపార్టీ గూటికి చేరుతున్నారనే విమర్శ మాత్రం ఒకటి బాహాటంగా వినిపిస్తోంది.