బెంగాల్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నాశనం బారి కాకుండా రక్షించారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడీ స్టేట్ ఠీవిగా, నిటారుగా నిలబడింది అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ (బీజేపీ) ‘షెహన్ షా’ ఏమీ కాదని, దాన్ని బెంగాల్ ప్రజలు ఎక్కడ ఉంచాలో, అక్కడే ఉంచారని ఆమె చెప్పారు. నాశనం నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజలు రక్షించారు..బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారు అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో బెంగాల్ ఇండియాను కాపాడిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని మమత అన్నారు. తాము 200 కి పైగా సీట్లను గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికిందని, కానీ ఆ పార్టీ అహంకారాన్ని ప్రజలు తుడిచిపెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. కమలం పార్టీ ఇగో ఇప్పుడు ఎక్కడికి పోయిందన్నారు. బీజేపీ ఇచ్చే డబ్బులు తీసుకోండి..కానీ ఓటు ఎవరికి వేయాలన్నది మీరే నిర్ణయించుకోండి అని ఆమె తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పదేపదే ఓటర్లను కోరుతూ వచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి గుణపాఠం కావాలన్నారు. ఈ ఫలితాల పట్ల ఆ పార్టీ నేతలు ఖంగు తిన్నారని ఆమె పేర్కొన్నారు.
కాగా ఈ ఫలితాలను బీజేపీ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బెంగాల్ లో మళ్ళీ దీదీదే పై చేయి అని, బీజేపీ రెండో స్థానంలో వస్తుందని ప్రకటించాయి. అయితే వీటిని నమ్మజాలమని, మే 2 వరకు వేచి చూద్దామని ఈ పార్టీ నేతలు అమిత్ మాలవీయ వంటివారు ట్వీట్స్ చేస్తూ వచ్చారు. అయితే మునుపటితో పోలిస్తే ఇప్పుడు తమ బలం కాస్త పెరిగిందని పార్టీ నేతలు సంతృప్తి పడుతున్నారు. కానీ ఈ పార్టీ ఎంపీ బాబుల్ సుప్రియో తన ఫేస్ బుక్ లో టీఎంసీ విజయం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ ఓటర్లు చరిత్రాత్మక తప్పిదం చేశారని ఆయన మండిపడ్డారు. తానుమమతా బెనర్జీని అభినందించబోనని , అలాగే ఈ ప్రజల తీర్పును శిరసావహించబోనని ఆయన అన్నారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని పేర్కొన్నారు. ఇది అవినీతికరమైన,అసమర్థ ప్రభుత్వమని, ఈ క్రూర మహిళకు (మమత)ప్రజలు మళ్ళీ అధికారం అప్పగించారని దుయ్యబట్టారు. కానీ ఈ పోస్టును ఆయన తరువాత తొలగించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal CM 2021: వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీ.. 5న ముహూర్తం..