MP Navneet kaur : శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంటు ప్రాంగణంలో తనను బెదిరించారని మహారాష్ట్రకు చెందిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్.. పీఎం నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంట్ లాబీల్లోనే అరవింద్ సావంత్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని హెచ్చరించినట్లు నవనీత్ ఆరోపించారు. తనపై బెదిరింపులకు పాల్పడ్డ ఎంపీ అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళలకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.
మహారాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై మాట్లాడటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. సావంత్ తనను ఒక్కరినే అవమానించారని అనుకుంటున్నారు.. కానీ నన్ను అవమానిస్తే దేశంలోని మహిళలందరిని అవమానించినట్టే అది తెలుసుకోవాలన్నారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా అంటూ అరవింద్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. మరోసారి ఇలా కాకుండా ఉండాలంటే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.