తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రాచారంలో దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు పట్టభద్రులతో సమావేశమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ పేట మండలకేంద్రంలో పట్టభద్రులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వేశామని తెలిపారు.
టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలంగా ఉందని అన్నారు. హైదరాబాద్ నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలకు రైలు, ప్రపంచంలోని అన్ని దేశాలకు విమాన సదుపాయం ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరున్నరేళ్లలో 14 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చి 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని అన్నారు. – ప్రతి నెలా 40 లక్షల మందికి పెన్షన్లు, ఏడాదికి రెండుసార్లు 60 లక్షల మందికి రైతుబంధు, 32 లక్షల మంది రైతులకు రైతు భీమా ప్రీమియం చెల్లిస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు. ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు ఈ పథకాలకే ఖర్చవుతుందని చెప్పారు. మిగిలిన డబ్బులతో ప్రాజెక్టులు, రహదారులు, ఇతర ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పథకాలు కొనసాగిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వమ్ముచేసిందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు సంస్థలను ప్రైవేటు పాలు చేసి బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగులకు తీరన అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఏడేండ్లకాలంలో మోడీ సర్కారు చేసింది ఇదేనని ఎద్దేవా చేశారు. సాదాసీదా మనిషి, ఛాయ్ వాలా ప్రధాని అవుతున్నాడు .. తమ బతుకుల్లో మార్పు వస్తుందని దేశప్రజలు సంతోషపడ్డారు. కానీ కేంద్రం నుండి ఏడేండ్లలో కలిగిన ఒక్క ప్రయోజనం అయినా ఉందా ? అని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జన్ ధన్ ఖాతాలలో 15 లక్షల రూపాయలు పడతాయని అంతా భావించారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ ప్రజల ఆశలు, ఆకాంక్షల మీద నీళ్లుచల్లారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం మానేసి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. 40 లక్షల మందికి ఉపాధినిస్తూ లాభాలలో ఉన్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటుపరం చేయడం మూలంగా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్న బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయని చెప్పాం .. తెచ్చిచూయించాం. తెలంగాణ మాదిరిగా దేశంలోని 21 రాష్ట్రాలలో ఎక్కడైనా పథకాలు అమలు చేస్తున్నారా ? అని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఉద్దేశించి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. రోజువారీగా మానవాళికి అవసరమైన పనులపై శిక్షణ అవసరం. ప్రపంచం అంతటా నడిచేది ఇదే .. మన దేశంలో పని అంటే నామోషిగా భ్రమింపజేసి ప్రజలకు నష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఆరేళ్లలో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించారా ? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
నాలుగుకోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇస్తే మరి మిగతా రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ఆలోచించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిస్తున్న 21 రాష్ట్రాలలో ఎక్కడైనా ఉద్యోగాలు కల్పించారా ? అని వారిని ప్రశ్నించండని పట్టభద్రులకు సూచించారు. తెలంగాణలో పశువులు, గొర్రెల సంపద పెంచాలి. మార్కెట్లో మాంసం డిమాండ్ కు తగినట్లు ఉత్పత్తి లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తరువాత తెలంగాణ ప్రాంతం, వాతావరణం దీనికి అనుకూలంగా ఉంది. అందుకోసం గొర్రెల పథకం ప్రవేశపెట్టాం. ఇలాంటి పథంక దేశంలో ఎక్కడా లేదని అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయం చేసే రైతుకు విశ్రాంతి లేదు. కడుపునొచ్చినా, కాలునొచ్చినా పొలానికి వెళ్లాల్సిందే. పశువులకు నీళ్లు తాపాల్సిందే, పొలానికి నీళ్లు పెట్టాల్సిందే. చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తే సంతోషంగా కండ్లకద్దుకుంటాడు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్పహిస్తున్నారని అన్నారు. అందుకు ప్రతిఫలంగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేది తెలంగాణ ప్రభుత్వమే. పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి .. విపక్షాల దుష్ప్రచారం నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Read More: