Minister Harish Rao: హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడుగు బొడుగు లేదని, టీఆర్ఎస్, బీజేపీ రెండు మాత్రమే పోటీలో ఉన్నాయని ప్రజలు ఏ పార్టీకి వేటు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. కడుపు నిండిన రాజేందర్ రైతు బంధు దండగ, కళ్యాణ లక్ష్మి పరిగె ఏరుకున్నట్లు అన్నారు కానీ తను మాత్రం పది లక్షల 50 వేలు రైతు బంధు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రాజేందర్ కేవలం పదవి కోసమే బీజేపీలో చేరారన్నారు. తన స్వార్థం కోసమే రాజీనామా చేశారని విమర్శించారు.
ఆరు సార్లు గెలిచిన రాజేందర్ ఒక్క మహిళా భవనం అయినా కట్టారా అని ప్రశ్నించారు. పండుగ పూట వడ్డీ లేని రుణం కావాలని అడిగితే 25 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం మంజూరుచేశామని గుర్తు చేశారు. 17 ఏళ్లు రాజేందర్ ను చూశారు ఒక్క సారి గెల్లుకు అవకాశ ఇవ్వండని ఓటర్లను అభ్యర్థించారు. ఈటల ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్లారు తప్పా సేవ చేయడానికి మాత్రం కాదన్నారు.
రాజేందర్ బొంద పెడతా, అగ్గిపెడతా, కూలగొడతా అన్నారు తప్పా ఇప్పటివరకు పేదలకు ఏం సాయం చేస్తారో చెప్పారా అని ప్రశ్నించారు. తిట్టడం వల్ల కడుపు నిండదు. తాను ఏం చేస్తాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బందు కార్యక్రమంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేస్తే 30 వ తేదీ వరకు ఆపమని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. రాజేందర్ గెలిస్తే బీజేపీ పార్టీకి లాభం గెల్లు గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.