కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొన సా… గుతోంది. తన ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తుండగా.. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. కాంగ్రెస్, జేడీ -ఎస్, బీజేపీ సభ్యులంతా వేరువేరు బస్సుల్లో విధాన సౌధ చేరుకున్నారు. సభలో విశ్వాస పరీక్షకు తాను సిధ్ధమని, సమయం చెప్పాలని కుమారస్వామి ఇదివరకే స్పీకర్ రమేష్ కుమార్ ను కోరిన సంగతి తెలిసిందే. అటు- బీజేపీ నేత యెడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ముంబైలోని ఓ హోటల్లో ఉన్న 14 మంది రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి రక్షణ కల్పించాలంటూ ముంబై పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో కోరారు. మల్లిఖార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర తమను కలిసేందుకు రావచ్ఛునని, వారితో భేటీ అయ్యేందుకు తాము ఇష్టపడడం లేదని వారు పేర్కొన్నారు. అటు-పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నుంచి కూడా తమకు ‘ భద్రత ‘ కల్పించాలని వారు అభ్యర్థించారు. మరోవైపు.. పదిమంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనున్న నేపథ్యంలో.. మరో అయిదుగురు కూడా… తమ రాష్ట్ర స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆనంద్ సింగ్, కె.సుధాకర్, మునిరత్న, ఎన్. నాగరాజ్, రోషన్ బేగ్ ఇలా పిటిషన్ వేశారు. పెండింగులో ఉన్న పదిమంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ తో బాటు దీనిపై కూడా మంగళవారం విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.