తెలంగాణలో RTC సమ్మె ఇప్పట్లో ముగిసే అవకాశాలు కన్పించడం లేదు. డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగుతుందని అఖిలపక్ష సమావేశంలో కార్మిక సంఘాలు ప్రకటించాయి. అవసరమైతే త్వరలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని JAC నేతలు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం లేదు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
అయితే.. ఇప్పుడు తెలంగాణాలో ఈ హాట్ టాపిక్‌తో పాటు.. హుజూర్‌నగర్‌లో బైపోల్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ఉప ఎన్నికపై పడతుందనే సూచనలు కనిపిస్తోన్నాయి. అటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కానీ.. ఇటు తెలంగాణ సర్కార్ కానీ.. ఎవరి మొండి పట్టు వారు వదలడం లేదు. పైగా.. ప్రజలను తమకే సహకరించాలని కోరుతున్నారు. కాగా.. బస్సులు లేక.. పండుగకు ఊరు వెళ్లి వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి తోడు.. ప్రైవేట్ ట్రావెల్స్.. డబల్ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. ప్రజలు అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
కాగా.. ఈనెల 21న హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుంది. అయితే.. ఈ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. బైపోల్‌పై ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఈ స్థానాన్ని ఇటు టీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. పోటాపోటీ వ్యూహాలకు కూడా తెరదించాయి. ఈ సమయంలో హఠాత్తుగా జరుగుతోన్న ‘ఆర్టీసీ సమ్మె’ ఒక విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రయోజనకరంగా మారుతుందన్న వ్యాఖ్యలు వినవస్తోన్నాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు. బీజేపీ, టీడీపీలు కూడా రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ.. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యనన్నది సుస్పష్టం. పైగా.. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఎం, టీజేఎస్ మద్దతుని ఇస్తున్నాయి.
హుజూర్‌నగర్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు కూడగట్టడానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అటు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా సుమారు 70 మందితో ఈ నియోజకవర్గంలో మోహరింపజేసి.. ప్రచార వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఒకవిధంగా.. ప్రతిపక్షానికి మేలు చేకూర్చవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా.. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆస్పత్రిలో.. ఆర్టీసీ కార్మికులకు వైద్య చికిత్సలను నిలిపివేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా.. ఈ ఉపఎన్నికపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే.. తాము ఎట్టి పరిస్థితిల్లోనూ.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతినిచ్చే పరిస్థితిలేదని ఇప్పటికే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ఈ నియోజక వర్గంలో.. సీపీఎం బలంగా ఉంది కూడా.
ప్రస్తుతం 28 మంది అభ్యర్థులు బైపోల్‌లో రంగంలో ఉన్నారు. వారిలో నలుగురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు కాగా.. మిగతా వారు ఇండిపెండెంట్ అభ్యర్థులు.