Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై తను బాధ్యతలు చేపట్టిన నుంచి జరిగిన పరిణామాలను ఒక్కదగ్గర చేర్చుతూ పుస్తకం విడుదల చేశారు. తన అమూల్యమైన అనుభవాలకు అక్షరరూపం దాల్చారు. ‘మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్’ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మీడియాతో పలు విషయాలను చర్చించారు.
తెలంగాణలో మహిళా సాధికారత సాకారమవుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్, ఉపమేయర్ మహిళలే కావడం హర్షణీయమని చెప్పారు. కొవిడ్ తొలి టీకా తెలంగాణ నుంచే వస్తుందని ముందే చెప్పానని, అనుకున్నట్లుగానే దేశంలోని రెండు టీకాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే తయారైందని తమిళిసై గుర్తు చేశారు. తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రంగా ఉందని, దీనిపైనే తొలిసారిగా లేఖ రాస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. ‘ఆ తర్వాత విద్య సంబంధిత అంశాలపై కూడా ప్రభుత్వానికి లేఖ రాశాను. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. సీఎంను కలిసినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండాలని చెప్తాను. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఉందని తన మనసులో మాటలను వ్యక్తపరిచారు.