రాజకీయాల్లో అందలం దక్కాలంటే ప్రజాభిమానంతోపాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇందుకు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీపీగా ఎన్నికైన హాలావత్ జ్యోతి ఉదాహరణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకోక తప్పలేదు . అనుకున్నట్టే లాటరీలో అదృష్టం ఆమెనే వరించింది. నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. బలం సమానంగా ఉన్నందున ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో లాటరీ తీశారు. అదృష్టం కాంగ్రెస్ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్ జ్యోతి తలుపుతట్టింది. దీంతో పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ నాయకురాలు, చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణినాయక్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడి పదవులు మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ నాయకులు కొంత సంతృప్తి చెందారు.