Telangana Congress : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మాస్కులు, మందులు, పండ్లు పంపిణీ చేస్తామని టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా సోకినవారిని ఆసుపత్రుల్లో చేర్పించడం, మందులు, ఇంజక్షన్లు అందించడంతోపాటు అవసరమైనవారికి ఆక్సిజన్ సమకూర్చేలా చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబులెన్సులు ఏర్పాటు చేయాలని శ్రేణులకు కోర్ కమిటీ సూచించింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సహకారంతో గాంధీభవన్‌లో ఏర్పాటు చేస్తున్న రెండు అంబులెన్సులను హైదరాబాద్‌కు 50 కి.మీ. పరిధిలో ఉండేవారు ఉపయోగించుకోవాలని కోరింది. జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో ఆక్సిజన్, అంబులెన్స్ సౌకర్యాలను రోగులకు సమకూర్చిన తీరును వివరించారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనాలోచిత వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవం ఏర్పడిందని విమర్శించారు. కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు ఉచితంగా కరోనా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఆయుష్మాన్ భారత్‌లో కానీ, ఆరోగ్యశ్రీలోకానీ ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.