ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వేదికగా ఆమె కొత్త పార్టీ ఏర్పాటుపై సిగ్నల్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఏర్పాటు కార్యక్రమాలను షర్మిల టీం ప్రారంభించింది. తమ పార్టీకి ఆమె వైయస్సార్టీపీ అనే పేరు పెడుతున్నట్టుగా కూడా షర్మిల టీం లీక్ చేసింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని షర్మిల స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు జగన్ తో తనకు సంబంధం లేదని… ఆయన దారి ఆయనదే, తన దారి తనదే అని చెప్పారు.
ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణలో మాత్రం ఆమెకు అప్పుడే రాజకీయ విమర్శలు ఎదురవుతున్నాయి. షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదని సీఎం కేసీఆర్ వదిలిన బాణం అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని గానీ తెలంగాణలో ఏం పనీ అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, కొత్త పార్టీ పెట్టి షర్మిల తప్పు చేస్తున్నారని అన్నారు.
తన తండ్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరును నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్ తో కలిసి పనిచేయవచ్చని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిల వీరందరూ కాంగ్రెస్‌పై అమిత్ షా వదిలిన బాణాలు అని జగ్గారెడ్డి అన్నారు. ఎన్ని బాణాలు వదిలినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం కాయమని ఆయన వదిలిన బాణాలే రివర్స్‌గా మారే ప్రమాదం ఉందని గ్రహించాలని జగ్గారెడ్డి చెప్పారు.
Read more: