CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి అంకానికి చేరుకుంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా, గవర్నర్ కోటాలో అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, జిల్లాలు, ఉద్యమకారులు అన్నింటిని భేరీజు వేసి ఫైనల్ లిస్టు తయారుచేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల నామినేషన్ లకు మంగళవారం చివరిరోజు కావటంతో ఆదివారం రోజు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపిక చివరి స్టేజీకి చేరుకున్నది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 19 సీట్లకు వంద మంది వరకు ఆశావహులు ఉండటంతో ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియారిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అవకాశాలుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ స్పీకర్ మధు సూధనా చారి, కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు ల పేర్లు వినిపిస్తున్నాయి. మధు సూదనా చారికి ఉద్యమకారుల కోటాలో ఎక్కువ అవకాశాలున్నాయి. సీనియర్ నేతగా , వరంగల్ పాలిటిక్స్ ను డీల్ చేయగలిగే కడియం శ్రీహరికి అవకాశం కనిపిస్తోంది. పార్టీ లాయలిస్టుగా, మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకొని ఉన్న తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. ఒక బిసీ, ఒక ఎస్సీ, ఒక వెలమ సామాజిక వర్గాలకు చెందిన నేతలుగా వీరి పేర్లు ఫైనల్ రౌండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా నుంచి మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా కోటి రెడ్డికి అవకాశం ఉంది… గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాకు పంపితే.. ఆకోటాలో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న పాడి కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాగర్ ఉపఎన్నికప్పుడు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన కోటి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.
అయితే ఒక జిల్లాలో ఇద్దరు రెడ్డిలకు అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. పాడి కౌషిక్ కు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా అన్నది క్లారిటీ లేదు. హుజూరాబాద్ ఓడిపోవటంతో ఆయన కు ఎమ్మెల్సీ అవకాశాలు సన్నగిల్లినట్లు చర్చ జరుగుతోంది.
తాజాగా టీఆర్ ఎస్ లో చేరిన ఎల్. రమణ పేరు కూడా వినిపిస్తోంది. కరీంనగర్ నుంచి చాలా మంది నేతలు ఎమ్మెల్సీ అవకాశం అడుగుతున్నా.. ఆయన పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారు అవడం ఎల్ . రమణ ప్లస్ పాయింట్ అంటున్నారు నేతలు. గతంలో పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. కాని ఆమెను వరంగల్ మేయర్ గా అవకాశం ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు మండలిలో ఒక్కరు కూడా లేకపోవటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు నేతలు.
మంత్రి హరీష్ రావు అనుచరుడు ఎస్సీ కార్పెరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా సార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేసిన ఎర్రోళ్ళ .. ఈసారి బాగానే లాబీయింగ్ చేయించినట్లు తెలుస్తోంది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పేరు కూడ వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావటం .. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావటానికి ఆయన ఇంటస్ట్ చూపుతుండడంతో ఆయన పేరు కూడా ప్రచారంలో ఉంది.
ఇప్పటి వరకు ఎవరికి ఎమ్మెల్సీకి అవకాశం వస్తుందనేది పార్టీ ముఖ్యనేతల నుంచి సమాచారం లేదు. ఆశావహులంతా నామినేషన్ కు సంబందించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రగతి భవన్ నుంచి సమాచారం రాగానే నామినేషన్ వేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంతం లేదా.. సోమవారం రోజు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం నామినేషన్ లకు చివరి రోజు కావటంతో సోమవారం రోజు నామినేషన్ లు వేసేందుకు వీలుగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు.
ఇవి కూడా చదవండి: Health Tips: గులాబీలా మెరిసిపోవడమే కాదు ఆరోగ్యం మీ సొంత చేసుకోండి.. ఎలానో తెలుసా..