రాజకీయనాయకుల ఎన్నికల వేళ రకరకాల వేషాలు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు. ఒకరు చేతి వృత్తులను ప్రదర్శిస్తే , మరొకరు భారీ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు. కొందరు రిక్షా తొక్కితే, మరికొందరు గుర్రం ఎక్కి ఊరేగుతారు. ఇలా తలో పని చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫిట్లను ప్రదర్శిస్తుంటారు. ఇలా బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓ అభ్యర్థి గేదెను ఎంచుకున్నాడు. అదే ఇప్పుడు ఆయన కొంపముంచింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గేదెపై కూర్చొని ప్రచారం నిర్వహించిన అభ్యర్థిపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి (45) గయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన గేదెపై కూర్చొని తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాగా, మన్సూరి గాంధీ మైదానం నుంచి స్వరాజ్‌పురి రోడ్డుకు చేరగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జంతు చట్టంతోపాటు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పర్వేజ్ పై ఐపీసీ సెక్షన్ 269, 270 ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మన్సూరిని బెయిల్‌పై విడుదల చేశారు. కాగా, జంతువులను ప్రచారం కోసం వినియోగించవద్దని ఈసీ ముందుగానే స్పష్టం చేసింది. కానీ ఇవేవీ ఖతర్ చేయని మన్సూరి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
మరోవైపు, గయ పరమ చెత్త నగరమని, ఆ విషయాన్ని రాజకీయ నాయకులకు తెలిపేందుకే తాను అలా చేసినట్లు మన్సూరి చెప్పుకొచ్చాడు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ 30 ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ శ్రీవాస్తవ 15 ఏండ్లుగా గయ ఉప మేయర్‌గా ఉన్నారని, అయినా నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా గయ ప్రాంత ప్రజలు కళ్లు తెరవాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే గయను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతానని మన్సూరి అంటున్నాడు.