Telangana Assembly Elections 2023: తెలంగాణ బిజెపి శాఖలో ఏం జరుగుతుంది? కొన్ని రోజులుగా రాష్ట్ర యంత్రాంగంలో ఎందుకు స్తబ్దత నెలకొంది? ఈ అంశాల మీద గత వారం రోజుల వ్యవధిలో పలు పత్రికలలో పలు రకాల కథనాలు చూస్తూ ఉన్నాం. ఏతావాతా వీటి సారాంశం ఏమిటంటే కర్ణాటక ఓటమి గుణపాఠంతో తెలంగాణ నాయకత్వాన్ని బిజెపి అధినాయకత్వం మార్చబోతోంది అన్నది. అయితే, స్థానిక నాయకత్వ మార్పు కోసం ఇది తగిన సమయమా కాదా అన్నది కూడా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మిగిలింది నాలుగు నెలల కాలమే. ఈ నాలుగు నెలల వ్యవధిలో కమలనాధులు కొత్త ప్రయోగాలు చేస్తారా అన్నది సందేహమే. చివరి నిమిషంలో చేసే ప్రయోగాలు వికటించే అవకాశాలే ఎక్కువ. ఆ విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం.. వ్యూహరచనలో ఆరితేరిన నాయకత్వం కలిగిన బిజెపికి బాగానే తెలిసి ఉంటుంది. మరి తెలంగాణ బిజెపి పగ్గాలను మార్చేందుకు బిజెపి అధినాయకత్వం మొగ్గు చూపుతోందా లేక అసంతృప్త నేతలను దారిలోకి తీసుకురావడానికి ఇంకేదైనా వ్యూహరచన చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. నిజానికి బీజేపీ అధినాయకత్వానికి ఇది చాలా ట్రికీ సిచ్యుయేషన్ అని చెప్పాలి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో బిజెపి హై కమాండ్ తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్ణాటకలో ఏవైతే తప్పులు జరిగాయో అవి తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడే దిశగా అడుగులు వేస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయ అవకాశాలు దెబ్బతినకుండా సంస్థాగతంగా మార్పులు చేసే అవకాశాలపై కమలనాథులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్‌కు జాతీయస్థాయిలో వేరే పదవిని ఇచ్చి.. అధ్యక్షునిగా వేరొకరిని నియమిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనికి అవకాశాలు తక్కువేనని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నాలుగు నెలల మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అధ్యక్షుని మార్పు కచ్చితంగా వికటించే ప్రయోగమే అవుతుందని కమలనాథులకు బాగా తెలుసు. అయితే, అసంతృప్తినేతలను ఎలా సంతృప్తి పరుస్తారు? ఎలా దారిలోకి తెచ్చుకుంటారు? అన్నదే ఇప్పుడు కీలకం. ఎన్నికలకు ముందు ప్రచార కమిటీ, మ్యానిఫెస్టో కమిటీ.. ఇలా రకరకాల కమిటీలను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుంటాయి. అదే కోణంలో ప్రచార కమిటీకి సారథ్య బాధ్యతలు వహించడం అనేది రాజకీయ నాయకులకు ప్రతిష్టాత్మకమైన విషయం. ఇప్పుడు తెలంగాణ బిజెపిలో ఆ పదవి కీలకంగా మారినట్లు కనిపిస్తుంది. ఏడాదికాలంగా చేరికల కమిటీ కన్వీనర్ గా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ బిజెపి సారథి కావాలని అనుకుంటున్నారు. కానీ ఆయనకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధారణంగా సంఘపరివార్ అండా దండాలేని వ్యక్తులను పార్టీ అధ్యక్షునిగా నియమించడం బిజెపిలో అత్యంత అరుదైన అంశం. దానికి తోడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించారు. పలు ఉప ఎన్నికలలో సానుకూల ఫలితాలు సాధించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని విప్పారు. ఈ అంశాలన్నీ బాగానే ఉన్నా ఇవి వచ్చే ఎన్నికల్లో విజయానికి సరిపోవు అని కొందరు అధినాయకత్వానికి నూరిపోయడంతో ప్రస్తుతం బిజెపి అధినాయకత్వం ఆలోచనలో పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని సంస్థకతంగా కొన్ని మార్పులను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ బిజెపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గానే అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి రాగాలకు చెక్ పెట్టాలని హై కమాండ్ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల భోగటట్టా. నేతలపై చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలో ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల అధినాయకత్వం సీరియస్‌గా ఉన్నట్టు కొంతమంది చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు తెలంగాణలో కెసిఆర్‌ను గద్దె దింపేది బిజెపి పార్టీనేనని చాలామంది భావించారు. అదే ఆలోచనతో చాలామంది పార్టీలో చేరారు కూడా. నిజానికి చేరికల కమిటీ కన్వీనర్‌గా ఉన్న ఈటల రాజేందర్ పెద్దగా పేరున్న నేతలను పార్టీలో చేర్పించడంలో విఫలం అయ్యారనే చెప్పాలి. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో తాను విఫలమైన సంగతిని బహిరంగంగా వెల్లడించి ఒకరకంగా శల్య ప్రకటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నింపారనే విశ్లేషించాలి. ఈ నేపథ్యంలోనే పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి రాగాలపైనా, అసంతృప్త నేతల కదలికలపైనా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన నందీశ్వర్ గౌడ్ బిజెపిలో .. కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ కోవర్టులు తమ విధానాలను మార్చుకోకపోతే 15 రోజులలో వారి పేర్లను బహిర్గత పరుస్తారని కూడా హెచ్చరించారు. ఇదంతా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేస్తున్నారని కొంతమంది అన్నా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. తాను బిజెపిని వీడేది లేదంటూనే మరోసారి కోవర్టులకు వార్నింగ్ ఇచ్చారు నందీశ్వర్ గౌడ్. ఇక తాజా పరిణామాల మీద రాష్ట్ర బిజెపి అంతర్గత సమీక్షకు పూనుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నాయకులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించుకుంటూ ‘‘ఏదైనా సమస్య ఉంటే పార్టీ వేదికపైనే లేవనెత్తాలి.. కానీ బహిరంగ ప్రకటనలకు దిగరాదు’’ అన్న ఇండికేషన్ ఇచ్చారు. నలుగురు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇద్దరు మాజీ ఎంపీలు ఇటీవల భేటీ అయి ఈటల కదలికలపై విశ్లేషణ జరిపినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మొదటి నుంచి బిజెపిలో ఉన్నవారికి.. గత రెండేళ్ల కాలంలో బిజెపిలో చేరిన వారికి పొసగకపోవడం ఇప్పుడు తెలంగాణ బిజెపికి ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేని పరిస్థితిలో ఇలాంటి పరిణామాలు సహజంగానే బిజెపి హై కమాండ్‌కు తలనొప్పిగా మారతాయి. ఇక్కడ ఇంకో అంశం ప్రధానంగా కనిపిస్తుంది. వరుస పాదయాత్రలతో దాదాపు ఏడాదిపాటు బండి సంజయ్ పార్టీ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇలా అయిదు దశల పాదయాత్రను బండి సంజయ్ పూర్తి చేసుకున్నారు. చివరి రెండు పాదయాత్రలకు పార్టీ అధినాయకత్వం, కేంద్ర మంత్రులు హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్‌ని గద్దె దింపే సరైన ప్రత్యామ్నాయం బిజెపినేనని చాటేందుకు ప్రయత్నం చేశారు. అదే ఉత్సాహంలో ఆరో విడత పాదయాత్రకు బండి సంజయ్ సిద్ధమైతే ఆయన పాదయాత్రకు కొందరు మోకాలడ్డినట్టు తెలుస్తోంది. నిజానికి బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రకమైన పాదయాత్రలు ఇతర రాష్ట్రాలలో కూడా చేయాలని సూచించారు. దాంతో బండి సంజయ్ పొంగిపోయారు. కానీ తీరా ఆయన ఖమ్మం నుంచి ఆరో విడత ప్రజా సంక్రమ యాత్ర ప్రారంభించాలని సంకల్పిస్తే కొందరు అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ యాత్రకు బ్రేక్ పడేట్టు చేసినట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇలా ఈ యాత్రకు బ్రేక్ వేయడం పరోక్షంగా తెలంగాణ బిజెపి శ్రేణుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లు అయిందని తాజాగా బిజెపి హై కమాండ్ గుర్తించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఒకరు మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ వెల్లడించడం విశేషం.
తాజా కథనాల మేరకు తెలంగాణ బిజెపిలో సంస్థగతమైన మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుని మార్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేని కారణంగా బండి సంజయ్ ని తప్పించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణల ఆధారంగా కీలక వ్యక్తులకు పదవులు అప్పగించే అంశాన్ని బిజెపి అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి.. అదే రకంగా ఓట్ల సంఖ్యలో అధికంగా ఉన్న బీసీ వర్గానికి చెందిన మరొక నేతకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలకు సారధ్యం వహించే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీ, ప్రచార సరంజామా ఏర్పాటు కమిటీ ఇలాంటి కమిటీల రూపకల్పన దిశగా బిజెపి అధినాయకత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బిజెపి ముఖ్యమంత్రులు, బిజెపి రాష్ట్ర శాఖల అధ్యక్షులతో కీలకమైన భేటీ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన నాయకులకు కూడా వారు దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయి. అదే సమయంలో సంస్థాగతమైన మార్పుల విషయంలో కూడా స్పష్టమైన సంకేతాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.