ఉగాది నుంచి వాలంటీర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..నవరత్నాలపై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి

|

Feb 10, 2021 | 6:24 PM

ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..

ఉగాది నుంచి వాలంటీర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..నవరత్నాలపై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి
Follow us on

ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. గత 20 నెలలుగా మీ అందరితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అధకారులనుద్దేశించి అన్నారు. మీ వంటి టీమ్‌ నాతో ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం జగన్‌ అన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసినందువల్లనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగామని చెప్పారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో విద్యాబోధన, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం, భూముల సమగ్ర రీసర్వే, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, విద్య వైద్య రంగాలలో నాడు–నేడుతో సమూల మార్పులు, 30.92 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి కార్యక్రమాలు కేవలం 20 నెలల వ్యవధిలోనే సాకారం చేసి చూపాం. అది మన ప్రభుత్వ అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోందని సీఎం జగన్‌ చెప్పారు.

పరిపాలనలో 20 నెలలు అంటే, దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయింది. అంటే మిడిల్‌ ఓవర్లలోకి వచ్చామన్న మాట. కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అదే జరిగితే మనం వెనకబడిపోక తప్పదని సీఎం జగన్‌ అన్నారు. ఇలాంటి సమావేశాలు తరుచూ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. శాఖలతో సంబంధం లేకుండా సరే, ఫలానా శాఖలో ఫలానా మార్పు చేస్తే ఇంకా సుపరిపాలన అందుతుంది అని మీరు భావిస్తే, ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు అభిప్రాయం తెలియజేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నవరత్నాలు–మేనిఫెస్టో గురించి సీఎం జగన్‌ వివరించారు. ప్రతి రోజూ కళ్ల ముందు కనిపించేలా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసేలా కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని ప్రతి శాఖ కార్యదర్శికి, ప్రతి విభాగాధిపతికి, ప్రతి కలెక్టర్‌కు అందజేశాం. అందులో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పని చేశాం. కార్యక్రమాలు నిర్వహించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం వరకు అమలు చేశాం. చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

నేను అధికారం చేపట్టిన తర్వాత దాదాపు రూ.60 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. వాటిలో రూ.21 వేల కోట్లు కేవలం విద్యుత్‌ బిల్లుల బకాయిలు కాగా, మిగిలిన రూ.39 వేల కోట్ల బిల్లులు వివిధ శాఖలకు సంబంధించినవి. జన్మభూమి కమిటీల యథేచ్ఛ అవినీతి పర్వం. ప్రతి పనికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి. కేంద్రంతో పాటు, పొరుగు రాష్ట్రాలతో కూడా ఏ మాత్రం సయోధ్య లేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి అన్నీ చక్కదిద్దుకుంటూ ఇంత దూరం వచ్చామని జగన్‌ అన్నారు.

పరిపాలనలో గతంలో కంటే ఎంతో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మండల స్థాయిలో పరిపాలన అందేది. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, ఇప్పుడు గ్రామ స్థాయిలోనే పాలన అందిస్తున్నాం. మనం ఏర్పాటు చేసుకున్న సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోవచ్చు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం. వారిలో కొందరు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని, అనర్హులైన వారిలో ఏ ఒక్కరికి కూడా సహాయం అందవద్దన్న సంకల్పంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి, ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం, మొత్తం వ్యవస్థనే నీరు గారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వాలంటీర్లను ప్రోత్సహించాల్సి ఉంది.

ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వాలంటీర్ల సత్కారం. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుంది. వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అప్పుడు వారు తమ బాధ్యతలను కేవలం ఒక ఉద్యోగంగా భావించకుండా, సేవా దృక్పథంతో పని చేస్తారని సీఎం జగన్‌ చప్పారు.

 

Read more:

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..