దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌.. మహిళా దినోత్సవం నాడు ఏపీ ప్రభుత్వం వరాలు

|

Mar 08, 2021 | 2:02 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఏపీ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఇప్పటికే అధిక ప్రాధాన్యమిస్తున్న..

దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌.. మహిళా దినోత్సవం నాడు ఏపీ ప్రభుత్వం వరాలు
Follow us on

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఏపీ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఇప్పటికే అధిక ప్రాధాన్యమిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు.

అలాగే బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ రూపొందించిన ‘దేశానికి దిశ’ పుస్తకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురిని ముఖ్యమంత్రి సత్కరించారు. ఏఎన్‌ఎం శాంతి, స్వీపర్ మబున్నీసా, మహిళా కానిస్టేబుల్‌ సరస్వతి, వాలంటీర్‌ కల్యాణీని సీఎం సత్కరించారు.

ఈ సందర్భంగా మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు.

అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. నామినేటెడ్‌ పోస్టులతోపాటు నామినేషన్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చామన్నారు.

అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్‌ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని’’ సీఎం జగన్‌ అన్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు.

దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Read More:

ఓవైపు వరాలు.. మరోవైపు ఆందోళనలు.. మహిళా దినోత్సవం నాడు అట్టుడికిన అమరావతి గ్రామాలు