పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించిన తెదేపా బూత్ కన్వీనర్ల సభలో చంద్రబాబు మాట్లాడుతూ… గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం స్థానాలను తెదేపా కూటమికే కట్టబెట్టారని అన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లే తమకు గుర్తింపు వచ్చిందని…తనకు కుటుంబం కంటే కార్యకర్తలే ఎక్కువని చెప్పారు. కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
మోదీ, కేసీఆర్ అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అవినీతిపరుడైన జగన్‌కు మోదీ కాపలా కాస్తున్నారు. విభజన చట్టం గురించి అడిగితే మోదీకి కోపం వచ్చింది. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. పులివెందుల హత్యా రాజకీయాలు మనకు అవసరమా? తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతి కేసుల్లో సీబీఐ 11 ఛార్జ్‌షీట్లు వేసింది. ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి. ఏ3 ప్రధాని కార్యాలయంలో ఉంటారు. వీరి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తామా? మోదీ, కేసీఆర్, జగన్ నన్ను బెదిరించాలని అనుకుంటున్నారు.. అది మీ వల్ల కాదు.
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. సొంత చిన్నాన్ననే పొట్టన పెట్టుకున్నారు.. మరీ ఇంత దుర్మార్గమా? రేపు ఇలాంటి వ్యక్తులకు ఒక్క ఓటు పడినా గల్లీకో రౌడీ.. ఊరికో హంతకుడు తయారవుతారు. ప్రతిపక్షంలో ఉంటేనే వారి ఇళ్లల్లో హత్యలు చేశారు. అదే పార్టీ అధికారంలోకి వస్తే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే రాష్ట్రంలో వైకాపాను భూస్థాపితం చేయాల్సిన అవసరముంది.’’ అని చంద్రబాబు తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు.