AP CM YS Jagan – AP BJP – Adinarayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసక్రమ ఆర్ధిక కార్యకలాపాలపై ప్రశ్నించినందుకు కేంద్రంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఎదురుదాడి చేస్తున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అప్పులు చేసే విషయంలో ఒక విధి విధానం ఉండాలని చెప్పిన ఆయన, ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి దానిని సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేసే అభివృద్ధి శూన్యం కాని, తన పత్రికలో మాత్రం రోజూ గొప్పగా రాసుకుంటున్నారు అని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంట్రాక్టర్‌లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వరు, విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, రైతుల దగ్గర కొన్న ధాన్యానికి బకాయిలు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వరు.. కాని, వేలకోట్ల రూపాయల అప్పులు మాత్రం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై నీచాతినీచమైన పదజాలంతో దాడి చేస్తున్నారు.. పత్రికలు, న్యాయ వ్యవస్థపై కూడా మాటల దాడులు చేస్తున్నారని ఆయన ఢిల్లీలో టీవీ9తో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉందంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు.
160 పైగా కోర్టులలో వ్యతిరేక తీర్పులు, 100 తప్పులు సీఎం జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనమని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన పై తప్పుడు కేసులు బనాయించారని, కుటుంబ సభ్యులే హత్య చేసారనేది సీఎం జగన్‌కు తెలుసని బీజేపీ నేత ఆరోపించారు. ఢిల్లీలో చెంచాగిరి, ఆంధ్ర ప్రదేశ్ లో గల్లీలలో దాదాగిరి వైఎస్సార్ పార్టీ నేతలది, ముఖ్యమంత్రిది అని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టిగా నిలబడి పోటీ చేసినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.. నన్ను అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కట్టు కథలు అల్లుతున్నారు.. త్వరలో సీబీఐ విచారణలో నిజాలు బయటకు వస్తాయి అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
Read also: కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!