Pawan Kalyan: గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం.. పవన్‌ కళ్యాణ్ శ్రమదానానికి అనుమతి నిరాకరణ

తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్‌ 2న పవన్‌ కల్యాణ్‌ చేయబోయే శ్రమదానానికి అనుమతి నిరాకరించారు అధికారులు. కాటన్ బ్యారేజీపై

Pawan Kalyan: గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం.. పవన్‌ కళ్యాణ్ శ్రమదానానికి అనుమతి నిరాకరణ

Updated on: Sep 30, 2021 | 12:13 PM

Pawan Kalyan – East Godavari Tour: తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ చేయబోయే శ్రమదానానికి అనుమతి నిరాకరించారు అధికారులు. కాటన్ బ్యారేజీపై అక్టోబర్‌ 2వ తేదీన శ్రమ దానానికి ప్లాన్‌ చేసింది జనసేన. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున వాటిని బాగు చేసి నిరసన తెలపాలని ప్రకటించింది. అయితే శ్రమదానానికి అనుమతి లేదని ప్రకటించారు ఇరిగేషన్‌ ఎస్‌ఈ. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న, కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. మరోవైపు బ్యారేజీపై శ్రమదానం చేసి తీరతామని చెబుతున్నారు జనసేన కార్యకర్తలు.

ఇలా ఉండగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రమదానం చేయాలని భావించారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయతలపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని కూడా పవన్ నిర్ణయించారు. అటు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓ రోడ్డుకు మరమ్మతు చేపట్టే కార్యక్రమాన్ని జనసేన చేపట్టాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం తెలిసిందే. నాలుగు వారాలు గడువునా ప్రభుత్వం ఇంకా ఎలాంటి మరమ్మతులు చేపట్టడకపోవడం పట్ల ఆ పార్టీ మండిపడింది. పాడైన రోడ్లను సరిచేసే విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ పాడైన రహదారుల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతారని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఏపీ సర్కారు బ్రేక్ వేసినట్టు కనిపిస్తోంది.

Read also: MP Galla Jayadev: భూఆక్రమణ ఆరోపణలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఫ్యామిలీపై కేసు