Amaravati Lands Insider: అసలు CID కేసు ఎక్కడ మొదలైంది? మంగళగిరి MLA ఆర్కే ఎందుకు CIDకి ఫిర్యాదు చేశారు? GO -41 ఎందుకింత వివాదంగా మారింది? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత నెల 12వ తేదీ నుంచి ఈ అసైన్డ్ భూముల కేసు వ్యవహారం మొదలైంది. ఇటీవల కాలంలో అమరావతి పరిధిలోని బేతపూడి, ఎర్రబాలెం, నవులూరుకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. తమ అసైన్డ్ భూములను కొందరు లాక్కున్నారని, కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ఫిబ్రవరి 12వ తేదీన ఎమ్మెల్యేను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రైతులు చెప్పిన వివరాలతో… మరికొంత సమచారాన్ని సేకరించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లాకు చెందిన జాన్సన్ అనే వ్యక్తి అప్పటికే అసైన్డ్ భూముల వ్యవహారంలో సమాచార హక్కు చట్టం కింద కొంత సమాచారాన్ని సేకరించారు. ఆయన తీసుకున్న జీవోలనే పరిశీలించి… CIDకి ఫిర్యాదు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ జీవోలు, అసైన్డ్ భూముల వివరాలతో గత నెల 24వ తేదీన CIDకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానిపై 25వ తేదీన విచారణ మొదలు పెట్టింది CID.
CID విచారణలో అసైన్డ్ భూములు లాక్కున్న వ్యవహారం బయటకొచ్చింది. ప్రాథమిక ఆధారాలతోనే… ఈ నెల 12వ తేదీన FIR నమోదు చేసింది CID. సెక్షన్ 166, 167, 217, 1977 ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు CID పోలీసులు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
అసలు చంద్రబాబు, నారాయణలకు ఈ కేసుతో లింకేంటి? CID వారికే ఎందుకు నోటీసులు ఇచ్చింది? అన్నది కూడా చర్చనీయాంశమైంది. దళితుల నుంచి అసైన్డ్ భూములను తీసుకోవడం అంటే అషామాషీ కాదు. 1977 ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములను పూర్తి పరిరక్షణ ఉంటుంది. ఆ చట్టాన్ని అతిక్రమించి అమరావతిలో దళితుల భూములను లాక్కున్నారన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణ.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణల ప్రకారం… అసైన్డ్ భూములను తీసుకుంటే ప్రభుత్వ ప్యాకేజీ ఇవ్వబోదని దళితులను కొందరు బెదిరించారు. అలా వందల ఎకరాలను కొందరు బలవంతంగా తీసుకున్నారు. ఆ తర్వాతే అసైన్డ్ భూములకు ప్యాకేజీ ఇచ్చేలా జీవో 41ను ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. అంటే అసలైన అసైన్డ్ హక్కుదారులు కాకుండా… బడాబాబుల చేతుల్లోకి ఆ భూములు వెళ్లిన తర్వాత ప్యాకేజీ ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం ఉందనేది ఆళ్ల ఆరోపణ.
1977 చట్టానికి విరుద్ధంగా జీవో 41ను తెచ్చారన్నది రామకృష్ణారెడ్డి వాదన. కాబట్టి చంద్రబాబు, నారాయణ ఇద్దరూ అందుకు బాధ్యులేనని చెబుతున్నారు. పైగా కేబినెట్‌లో చర్చించకుండా జీవో 41ను తెచ్చారని, దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నోట్ ఫైల్స్ కూడా ఉన్నాయని ఆధారాలు ఉన్నాయన్నారు.
తన బినామీలకు లబ్ది చేకూర్చేందుకు చట్టానికి విరుద్ధంగా, కేబినెట్‌లో చర్చించకుండా జీవో 41ను తీసుకొచ్చిన చంద్రబాబును శిక్షించాల్సిందేనంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి
LIC’s Bachat Plus Policy: రక్షణతోపాటు.. పొదుపు కోసం ఎల్‌ఐసీ కొత్త పాలసీ “బచత్ ప్లస్”..
Bank Strike Today: రెండో రోజూ కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రైక్.. నిలిచిపోయిన లావాదేవీలు..