గ్రేటర్ వరంగల్ యుద్ధంలో పార్టీలన్నీ కోచ్ ఫ్యాక్టరీ చుట్టూ చక్కర్లు కొడుతుతున్నాయి. అధికార గులాబీ సహా పార్టీలన్నీ కూడా విభజన హామీపై కమలనాథులను కార్నర్ చేస్తున్నాయి. కాషాయదళాలకు.. గులాబీ శ్రేణులకు మధ్య అభివృద్ధిపైనా ఛాలెంజ్‌లు నడుస్తున్నాయి. ఎవరి చిట్టా వాళ్లు విప్పుతూ చౌరస్తా సవాళ్లకు సై అంటున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఎన్నికలు ఏవైనా ఎజెండా ఇదే.. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే హాట్ టాపిక్‌గా మారిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ… ఇప్పుడు గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు కేంద్రబిందువైంది.
వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికల శంఖారావం మోగించడానికి వచ్చిన బండి సంజయ్ కోచ్ ఫ్యాక్టరీపై రూటు మార్చారు. ఇంతకుముందు మీ వల్లే రాలేదంటూ రాష్ట్రంపై కమలనాథులు నెట్టుకొచ్చూ వచ్చారు. ఇప్పుడు అసలు మా పార్టీ ఎప్పుడు చెప్పిందని తేల్చేశారు. హామీ ఇచ్చింది మేం కాదు.. ఒకవేళ చట్టంలో ఉన్నా మీరు భూమి ఇవ్వకపోవడం వల్లే రాలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే కోచ్ ఫ్యాక్టరీకి తమకు సంబంధం లేదని ఒక్కముక్కలో తెగ్గొట్టారు
సమయం కోసం చూస్తున్న గులాబీ శ్రేణులు బీజేపీ చీఫ్‌ను కోచ్ ఫ్యాక్టరీపై టార్గెట్ చేశాయి.. విభజన హామీ చట్టంలోనే ఉంటే.. తమకు సంబంధం లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. బీజేపీ అసలు రంగు బయటపడిందంటున్నారు. బీజేపీ తమకు తెలియదని తప్పించుకున్నా… ఎలా సాధించాలో తెలుసన్నారు. రాదు.. పోదు… కనుచూపుమేరలో లేదంటారా? మీరెవరు ఖాజీపేటకు ఫ్యాక్టరి రాదని చెప్పడానికి అంటూ కస్సుమంటున్నారు.
కాషాయదళం మాటలతో వరంగల్‌లో అగ్గిరాజుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో హుషారుగా ఉన్న గులాబీ దళాలు సైలెంట్గా ఉంటాయా.. కయ్యానికి వచ్చిన కమలనాథులపై కత్తులు నూరుతున్నారు. కారు కూతలు కూస్తేనే MLCఎన్నికల్లో జనాలు ఖతర్నాక్ సమాధానం ఇచ్చినా ఇంకా బుద్ది రాలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ రాజకీయాల్లో విషం చిమ్మితే జనాలే ఛీకోడతారంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
BJPపై ట్వీట్టర్‌లో వ్యంగాస్త్రం సంధించారు KTR. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోయినా మేథా సర్వో డ్రైవర్స్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలతో ప్రైవేట్ రంగంలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతోందని ట్వీట్ చేశారు కేటీఆర్. అయినా ఖాజీపేట వదిలేది లేదంటూ సంకేతాలు ఇచ్చారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏ పార్టీ భవిష్యత్‌ను ఏం చేస్తుందనేది ఎన్నికల్లో తేలనుంది.