
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యమే ఆస్తమా రోగుల సంఖ్య పెరగడానికి కారణం. ఆస్తమా ఎవరికైనా రావచ్చు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్ధులలో కనిపిస్తుంది. పరిశుభ్రత, దుమ్ము ధూళికి దూరంగా ఉండటం, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. కనుక ఈ రోజు ఆస్తమా రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం: ఆస్తమా రోగులు తినే ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడేవారిలో శ్వాసకోశంలో వాపు సంభవిస్తుంది. దీంతో రోగి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు శ్వాసకోశలో వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెగ్నీషియం తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్ళు, ఆకుపచ్చ కూరగాయలు, చేపలు మొదలైన వాటిలో మంచి పరిమాణంలో మెగ్నీషియం లభిస్తుంది.

ఆస్తమా రోగులు తినే ఆహారంలో దానిమ్మ , కివిలను చేర్చుకోండి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆస్తమాతో బాధపడేవారికి కూడా అవకాడో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అల్లం ఆస్తమా రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే అల్లం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.

ఆస్తమాతో బాధపడేవారు శ్లేష్మం గుణం ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. క్యాబేజీ, అన్నం, పెరుగు, చల్లటి పదార్థాలు, వేయించిన ఆహారం, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోనేటేడ్ డ్రింక్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి.

అధిక ధూళి తాకడం వల్ల ఉబ్బసం వస్తుంది. కనుక బయటకు వెళ్లే సమయంలో మాస్క్‌ని ఉపయోగించాలి, అంతేకాదు ఇన్‌హేలర్‌ను తప్పని సరిగా దగ్గరే ఉంచుకోవాలి. అదే సమయంలో ఇంట్లో శుభ్రతపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దుప్పట్లు, బెడ్‌షీట్‌లను తరచుగా శుభ్రం చేయాలి. ఆస్తమా రోగులు పొరపాటున కూడా ధూమపానం మొదలైనవి చేయకూడదు.