
పెరిగే ఊబకాయం: మనం భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నప్పుడు మన మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. దీనివల్ల పొట్ట నిండిందనే సంకేతం మెదడుకు ఆలస్యంగా అందుతుంది. ఫలితంగా మనం తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఇదే మెల్లగా ఊబకాయానికి దారితీస్తుంది.

జీర్ణవ్యవస్థ చిన్నాభిన్నం: ఆహారాన్ని సరిగ్గా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి మెట్టు. ఫోన్ చూస్తూ తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. ముక్కలు ముక్కలుగా మింగేయడం వల్ల అది జీర్ణం కాక మలబద్ధకం , కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.

స్క్రీన్ చూస్తూ తినడం వల్ల మన జీవక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో అసాధారణ మార్పులు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను, టీవీ రిమోట్లను కనీసం 10 అడుగుల దూరంలో ఉంచండి. ఆహారం రుచి, వాసన, రంగును గమనిస్తూ తినండి. దీనివల్ల ఎంజైమ్‌లు బాగా విడుదలై జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ప్రతి ముద్దను కనీసం 32 సార్లు నమలాలని ఆయుర్వేదం చెబుతోంది. ఆహారం నోట్లోనే ద్రవంగా మారినప్పుడు కడుపులో భారం తగ్గుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ అగ్ని చల్లారిపోతుంది.