
హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లగానే గంట మోగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. గంట మోగించినప్పుడు వచ్చే పవిత్ర ధ్వని దుష్ట శక్తులను తరిమికొట్టి సాత్విక వాతావరణాన్ని సృష్టిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే, గంటల తయారీకి వాడే లోహాల వల్ల ఉత్పత్తయ్యే ప్రతిధ్వని మన మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా ఈ ధ్వని తరంగాలు గాలిలోని సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. గంటానాదం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆధ్యాత్మిక నమ్మకం: పురాణాల ప్రకారం గంట మోగించడం అనేది భగవంతునికి మన రాకను తెలియజేసే ఒక సంకేతం. దేవుడా.. నా విన్నపాన్ని ఆలకించు అని దైవ సన్నిధిలో ప్రార్థించడానికి ఇది సూచికగా పనిచేస్తుంది. శ్లోకాల ప్రకారం గంటానాదం అనేది దైవ శక్తులను ఆహ్వానించి, దుష్ట లేదా అసుర శక్తులను తరిమివేసే ఒక పవిత్ర ప్రక్రియ. ఇది ఆలయ ప్రాంగణంలో సాత్విక ప్రకంపనలను పెంచుతుంది.

దేవాలయాల్లో ఉండే గంటలు సాధారణ లోహంతో చేసినవి కావు. కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి అనేక లోహాలను నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి వీటిని తయారు చేస్తారు. ఈ గంటను మోగించినప్పుడు వచ్చే శబ్దం కనీసం 7 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తుంది.

7 సెకన్ల పాటు సాగే ఈ ధ్వని తరంగాలు మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేసి, శరీరంలోని ఏడు ముఖ్యమైన శక్తి కేంద్రాలను ఉత్తేజపరుస్తాయి. మనస్సులో ఉండే అనవసరమైన ఆలోచనలు, భయాలు తొలగిపోయి భక్తుడికి ధ్యానించే స్థితి లేదా పూర్ణ ఏకాగ్రత లభిస్తుంది. దైవ దర్శనం చేసుకునే సమయంలో మనస్సు ప్రశాంతంగా మారడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

గంట మోగించినప్పుడు ఉత్పత్తయ్యే శబ్ద తరంగాలకు, ప్రకంపనలకు గాలిలోని హానికారక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తారు. దీనివల్ల గుడి వాతావరణం పరిశుభ్రంగా మారుతుంది. కాబట్టి, గుడిలోని గంట కేవలం ఒక లోహపు వస్తువు కాదు, అది మన ఆలోచనలను, శరీరాన్ని దైవ ప్రార్థనకు సన్నద్ధం చేసే ఒక అద్భుత సాధనం.