
మన తెలుగు వారికి టీతో చాలా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచింది మొదలు చాలా మంది తమ రోజును 'టీ'తోనే ప్రారంభిస్తారు. ఘుమఘుమలాడే టీ చుక్కలు గొంతులు తడిపితే రోజంతా హుషారు పుంతలు తొక్కుతుంది. ఇక కొందరైతే పడుకునే ముందు కూడా 'టీ' తాగుతారు. అయితే టీ ఇలా వేళాపాలా లేకుండా తాగడం పట్ల ఆరోగ్యానికి ఎన్నోరకాలు హానికరమని నిపుణులు అంటున్నారు.

అదే 30 రోజులపాటు టీ తాగకపోతే మన శరీరంలో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అవును.. ఓ నెల పాటు టీ తాగకపోతే బరువు వేగంగా తగ్గవచ్చట. ఇందులో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారి తీస్తాయి. అటువంటి పరిస్థితిలో టీ తాగకపోవడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పాలతో చేసిన టీ తాగకపోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మిల్క్ టీలో ఉండే కెఫిన్, టానిన్లు జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇది అసిడిటీ సమస్యలను కలిగిస్తుంది. అదే టీ తాగడం మానేస్తే, జీర్ణక్రియ మెరుగుపడి అసిడిటీ సమస్య తొలగిపోతుంది.

టీలో ఉండే కెఫిన్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. టీ తీసుకోవడం తగ్గించడం వల్ల బాగా నిద్రపడుతుంది. అది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. టీలోని చక్కెర చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఇది మొటిమలకు కూడా కారణమవుతుంది. టీ తీసుకోవడం తగ్గిస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

టీ తీసుకున్న వెంటనే ఒంట్లో శక్తి స్థాయిలను పెంచుతుంది. కానీ తరువాత మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి మీరు టీ తాగడం మానేస్తే ఒంట్లో శక్తి స్థాయిలు రోజంతా స్థిరంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ఓ నెల పాటు టీ తాగకపోతే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.