
కొండ, కోనలతో అలరారే అందమైన ఊళ్ళు, చుట్టూ పంట పొలాలు, ఉన్నంతలో కళకళలాడే లోగిళ్ళు, శ్రమైక సౌందర్యం ఉట్టిపడే చిరునవ్వు మోములు.. స్వయం సంవృద్దితో అభివృద్ది బాటలో పయనిస్తున్న గ్రామాలు.. పల్లె జీవనంలో ఇంతకన్నా ఇంకేం కావాలి. అనుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ నల్లమల అడవి పుత్రుల జీవితాల్లోకి వెలిగొండ కోసం త్యాగాలు చేయాల్సిన తరుణం వచ్చింది. జనం కోసం, అభివృద్ది కోసం పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళను వదిలి ఊరు ఊరంతా తరలివెళ్ళారు. ఎవరికోసమో తమ సర్వస్యం త్యాగం చేశారు. ఇప్పుడు ఆ ఊళ్ళంతా నీటి గర్భంలో కలిసిపోతున్నాయి. మిగిలిన మొండి గోడలు తమ చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి నాడు పట్టెడన్నం పెట్టిన భూమి నేడు కృష్ణమ్మ ఒడిలో సేదతీరుతోంది. బరువెక్కిన హృదయాలతో వెలిగొండ ముంపు గ్రామస్థులు తట్టాబుట్ట సర్దుకుని, పిల్లాపాపలతో తరలివెళ్ళిపోయారు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన పెద్దారవీడు మండలం కలనూతలకు కడసారి కన్నీటితో గ్రామస్తులు వీడ్కోలు పలికారు. వెలిగొండ ఫీడర్ కెనాల్ నుంచి నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్ కు నిన్న సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను విడిచిపెట్టడంతో ముంపు గ్రామాలకు భారీగా నీరు చేరింది. దీంతో ఇంకా ఖాళీ చేయని కొంతమంది కలనూతల గ్రామంలోని గ్రామస్తులు ఇల్లు వాకిళ్లు వదిలి, పశువులను వెంటబెట్టుకొని చెమ్మగిల్లిన కళ్ళతో తరలి వెళ్ళిపోయారు. గ్రామాన్ని విడిచి పెడుతూ చివరిసారిగా గ్రామంలోనే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓ జంట వివాహం చేసుకొని ప్రార్థన కోసం తరలి వెళ్తున్న హృదయాలను కదలించే దృశ్యాలు కనిపించాయి. ముంపు గ్రామమైన కలనూతలకు కృష్ణా జలాలు వేగంగా చేరుకుంటున్నాయి. మరో ముంపు గ్రామం సుంకేసుల గ్రామంలోని చెరువుకు కృష్ణా జలాలు రావడంతో చెరువు నిండింది. రోడ్డుపై నీరు ప్రవహించడంతో గ్రామం వీడి తరలి వెళుతున్న గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముంపు గ్రామాల్లోకి కృష్ణా జలాలు ప్రవహిస్తుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు తరతరాలుగా సుంకేసుల, కలనూతల గ్రామంలో నివసిస్తూ భూములు, ఇళ్లు కోల్పోయినప్పటికీ కొందరి పేర్లు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అర్హులైన కుటుంబాలు ప్యాకేజీకి దూరమయ్యాయని ఆరోపిస్తున్నారు. తల్లికి ప్యాకేజీ వస్తే కొడుకుకు రాలేదని, చెల్లికి వస్తే అక్కకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని కడసారిగా వేడుకుంటున్నారు.ఈ పరిస్థితుల్లో ముంపు గ్రామంగా ఉన్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలోకి చేరుతున్న వెలుగొండ జలాలలో నీటిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను ఏడు గంటల పాటు శ్రమించి ఈరోజు ఉదయం రెస్క్యూ సిబ్బంది కాపాడారు. నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ఉధృతికి బొలెరో వాహనం రాత్రి కొట్టుకుపోయింది.

వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కాపాడుకుని చెట్టు ఎక్కి ఆర్తనాదాలు చేశారు. వీరి గురించి సమాచారం అందుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత, డీఎస్పీ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫీడర్ కాలువ నుంచి వస్తున్న నీటిని నిలిపివేసి ప్రవాహ వేగం తగ్గిన తరువాత ప్రోక్టయిన్ సాయంతో నీటిలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.నిన్న ఉదయం వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల రిజర్వాయర్కు అధికారికంగా నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు.. ఈ నేపధ్యంలో సకాలంలో ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయించ లేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముంపు గ్రామాల్లోకి వెలుగొండ నీరు చేరుతుండటంతో పోలీసులు గ్రామాల్లోకి వెళ్ళకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలాగే కలనూతలలో నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ 150 మందికి ఇంకా పునరావాసం ప్యాకేజి అందలేదు. ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరికి ప్యాకేజి ఇచ్చి ముగ్గురికి అందకుండా చేశారని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఊరిని, ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాలని ప్యాకేజి అందని నిర్వాసితులు కళ్ళనీళ్ళ పర్యంతమవుతున్నారు. ప్యాకేజీతో పాటు పట్టాలిచ్చి, స్థలాలు చూపిస్తే తాము కూడా సంతోషంగా ఉంటామని ప్యాకేజి అందని నిర్వాసిత కుటుంబాలు చెబుతున్నాయి. ఇల్లు పూర్తయ్యేవరకు ఆ స్థలాల్లో టెంట్ వేసుకుని అయినా జీవనం గడుపుతామంటున్నారు.మరోవైపు నిర్వాసితులకు ఈ మధ్యే ప్యాకేజీ ఇచ్చినందున పునరావాసకాలనీల్లో ఇళ్ళు ఇంకా పూర్తి కాలేదు. అద్దె ఇళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని అడిగారు. అయితే అంతకు ముందే వెలిగొండ జలాలను నల్లమల సాగర్‌కు విడిచి పెట్టాల్సి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కొల్లంవాగు దగ్గర ప్రస్తుతం సరిపడినంత ఉన్నందున వెంటనే నీటిని ఒడిసిపట్టి నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తరలించాల్సి వచ్చింది. దీంతో కొంత హడావిడి పడాల్సి వచ్చింది.మరోవైపు పట్టాలు పొందిన వారు పునరావాస కాలనీల్లో ఇళ్ళు కట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏది ఏమైనా ఒకవైపు వెలిగొండ జలాలు మార్కాపురం ప్రాంతాన్ని సస్యస్యామలం చేస్తుందన్న అనందం ఒకవైపు, పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళని వదిలి వెళుతున్న నిర్వాసితుల త్యాగం మరోవైపు నాణేనికి రెండు వైపుల అన్నట్టుగా జీవన చిత్రం కనిపిస్తోంది ఇక అంతా మంచే జరిగిందని భావించాలి. సర్వేజనా సుఖినోభవంతు.