
ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు తిరుమల కొండ కూడా కిటకిటలాడు తోంది. శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమలలో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న టిటిడి మెరుగైన సేవలు అందిస్తోంది.

తిరుమల కలియుగ వైకుంఠం. శ్రీవారిని దర్శించు కునేందుకు నిత్యం కొండకు చేరే భక్తులతో కిటకిటిలాడే ప్రాంతం. ఇలా ఎప్పుడూ కొండ నిండా జనం ఉండే చోట వేసవిలో మరింత రద్దీ కనిపిస్తోంది. గత 10 రోజుల్లో వెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 10 రోజులుగా రికార్డు స్థాయిలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

10 రోజుల్లో 8,84,426 మంది భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శ్రీవారి సేవల సమయంలోనూ భక్తులను స్వామి వారి దర్శనానికి టిటిడి అనుమతించింది. ఇక 10 రోజుల్లో 4,51,324 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండీ ఆదాయం రూ 40.8కోట్లు పొందింది. రోజు సగటున శ్రీవారిని దర్శించుకున్న 88 వేల మంది భక్తులు కాగా రోజు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లకు పైగానే టిటిడి ఖాతాకు జమ అయ్యింది.

ఈ పది రోజుల్లో 24న అత్యధికంగా 98,058 భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25న హుండీ ఆదాయం రూ 4.92 కోట్లు వచ్చింది. మరోవైపు ఈనెల 23న 57,780 మంది భక్తులు మొక్కులో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమలలో అన్యూహంగా పెరిగిన భక్తుల రద్దీకి టిటిడి ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న టీటీడీ యంత్రాంగం శ్రీవారి దర్శనాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించి పర్యవేక్షిస్తున్నారు

ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో శుక్రవారం నాడు 83 వేల మందికి దర్శనం చేయించినట్లు ప్రకటించారు. అభిషేకం సమయంలోనూ భక్తులకు సర్వదర్శనం కల్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రవేశ క్యూలైన్లను మారుస్తున్న టీటీడీ జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు,విజిలెన్స్ సిబ్బందితో రాత్రింబవళ్లు పని చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది.