మిరియాలలోని పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటి గొప్పతనం తెలుసుకున్న మన పూర్వీకులు మిరియాలను మన వంటల్లో భాగంగా చేశారు. ఆయుర్వేద వైద్యులు కూడా మిరియాలను అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
మిరియాలను నేరుగా నమిలి తినగలిగిన వారు రోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు మిరియాలను నమిలి మిగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.
అజీర్తి సమస్యతో బాధపడే వారు మిరియాలను పాత బెల్లంతో కలిపి తింటే ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడిని వేసి కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు భోజనానికి అర గంట ముందు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని ఒక గ్లాస్ వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
తరచూ జలుబు, తుమ్ములు వంటి వాటితో బాధపడే వారు నీటిలో పసుపు, మిరియాల పొడి వేసి మరిగించి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు ఉన్న వారు మిరియాల పొడిని, రాళ్ల ఉప్పుతో కలిపి చిగుళ్లపై ఉంచడం వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.