
కొంతమందికి తినేటప్పుడు ముఖంపై చెమటలు పట్టడం సహజం. కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమటలు పడుతూ ఉంటాయి. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, సాధారణ ఆహారం తింటున్నప్పుడు కూడా మీకు చెమటలు ఎక్కవుగా పడుతుంటే దానిని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దంటున్నారు వైద్యులు. అది మీ శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం కావచ్చంటున్నారు.

శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పుల వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య రావచ్చని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపించే అవకాశం ఉందంటున్నారు.

ఈ సమస్యను తగ్గించుకోవాలంటే, మీరు మీ జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా వేడిగా, కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా మోతాదులో తినకుండా, కొద్ది కొద్దిగా తినడం ఉత్తమం అని చెబుతున్నారు.

అంతేకాదు మీ శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని.. ఇందుకోసం మీరు రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం అంటున్నారు. అలాగే, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని.. ఇందుకోసం తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుకోవచ్చంటున్నారు.

ముఖ్యంగా తినేటప్పుడు చెమట పట్టడం ఒక చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, అది తరచుగా సంభవిస్తే, వైద్య సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే. మనం ఎలాంటి ఆరోగ్య సమస్యల భారీన పడే అవకాశం ఉండదని చెబుతున్నారు.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)