
ప్రతి ఇంటిలోనూ పచ్చి ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉంటుంది. ఉల్లిపాయలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఆహారానికి అదనపు రుచిని పెంచడానికి ఉల్లిపాయలను వంటల్లో ఉపయోగిస్తారు. అయితే, చాలా మంది పచ్చి ఉల్లిపాయలను తింటారు. ఉల్లిపాయలను తరచుగా సలాడ్లలో ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలు లేని కూర రుచి ఉండదని.. తినడానికి కూడా ఇష్టపడరు కొందరు. మటన్, చికెన్ కూరల్లోనే కాదు పప్పు, పులుసు, వేపుడుల్లో కూడా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. అయితే వేసవిలో ఉల్లిపాయలను పచ్చిగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవి నెలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పచ్చి ఉల్లిపాయలు తినడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి వివిధ రకాల పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణురాలు ప్రియా పలివాల్ అన్నారు. అందువల్ల ఉల్లిపాయలను సలాడ్‌గా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ ఇచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుదల వేసవిలో గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తరచుగా సంభవించవచ్చు. పచ్చి ఉల్లిపాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో చాలా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపును శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఉల్లిపాయ కడుపును ఏ రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా శరీరాన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కనుక సలాడ్లలో పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెప్పారు.

వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల హీట్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం ద్వారా పచ్చి ఉల్లి మిమ్మల్ని కాపాడుతుంది.

ఉల్లిపాయలు సహజంగా చల్లదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, వేసవిలో వాటిని తినడం వల్ల సహజంగానే శరీరం చల్లబడుతుంది. ఉల్లిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇది అటువంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, అవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ విధంగా వేసవిలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఉల్లి బలేగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.