
పరమాన్నం: వరలక్ష్మి వ్రతం ప్రసాదాలలో పరమాన్నం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. పరమాన్నం టెంపుల్ స్టైల్‌లో రుచికరంగా చేయాలి అంటే ఈ చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా దీని కోసం బియ్యం, పెసరపప్పుతో పాటు బెల్లాన్ని వాడతారు. బెల్లాన్ని ముందుగానే కరిగించి చల్లార్చి పెట్టుకోవడం వల్ల పరమాన్నంలో పాలు విరగకుండా ఉంటాయి. అలాగే, అన్నాన్ని పాలతో మాత్రమే ఉడికించడం వల్ల దీనికి అద్భుతమైన రుచి వస్తుంది. మధ్య మధ్యలో మీగడను అన్నంలోకి కలుపుతూ ఉడికిస్తే మరింత రుచిగా ఉంటుంది. చివరిగా, యాలకుల పొడి, పచ్చ కర్పూరం,నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లు చేర్చడం ద్వారా దేవాలయ ప్రసాదం లాంటి కమ్మని పరమాన్నం సిద్ధమవుతుంది. చల్లారినా కూడా గట్టి పడకుండా, క్రీమీగా ఉండాలంటే దీని కన్సిస్టెన్సీని సరైన రీతిలో ఉడికించడం ముఖ్యం.

పూర్ణం బూరెలు: పూర్ణం బూరెలు లేకుండా వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు అసంపూర్ణం. పూర్ణం బయటకు రాకుండా, కరకరలాడే పూర్ణం బూరెలను తయారు చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా, పూర్ణం బూరెల పిండి కోసం బియ్యం, మినపప్పును నానబెట్టి, మినపప్పును మెత్తగా, బియ్యాన్ని కొంచెం బరకగా రుబ్బి తీసుకోవాలి. ఇది బూరెలు కరకరలాడటానికి సహాయపడుతుంది. పూర్ణం కోసం పచ్చిశనగపప్పును ఉడికించి, బెల్లంతో కలిపి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. దీనికి యాలకుల పొడి, సోంపు, నెయ్యి జోడిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. పూర్ణం పల్చగా అయితే బొంబాయి రవ్వను దోరగా వేయించి కలిపితే చిక్కబడుతుంది. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉంటే పూర్ణాలకు కోటింగ్ సరిగా పడుతుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు పూర్ణాలు అతుక్కోకుండా చూసుకోవాలి. లోపల పూర్ణం బయటకి వస్తున్నట్లు అనిపిస్తే, బూరెను తీసి చల్లార్చి, బియ్యప్పిండిని దానిపై అద్ది తిరిగి వేయించవచ్చు.

కమ్మని రుచితో పులిహోర: పండుగ అంటే ఇంట్లో తప్పకుండా పులిహోర ఉండాల్సిందే. వరలక్ష్మి వ్రతం రోజున త్వరగా, సులువుగా పులిహోర తయారు చేసుకోవచ్చు. అన్నం పొడిపొడిగా రావడానికి వండేటప్పుడు నూనెను చేర్చాలి. చింతపండు పులుసును చిక్కగా తయారు చేసుకోవాలి. పులిహోర పొడి కోసం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడి పులిహోరకు మంచి సువాసన, రుచిని ఇస్తుంది. పోపు కోసం పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువను నూనెలో వేయించి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చివరగా, ఉడికిన అన్నంలో చింతపండు గుజ్జు, తయారు చేసుకున్న పొడి, పోపును కలిపితే కమ్మని పులిహోర సిద్ధం.

అల్లం గారెలు : అల్లం గారెలు వ్రతాలలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి నూనె లేకుండా మంచిగా రావాలి అంటే ఇలా చేయాలంట. ముందుగా దీని కోసం మినపప్పును పచ్చిశనగపప్పు, బియ్యంతో కలిపి నానబెట్టాలి. పప్పును మిక్సీలో మెత్తగా రుబ్బేటప్పుడు తక్కువ నీటిని ఉపయోగించాలి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. వంట సోడా వాడకుండానే పిండిని రెండు మూడు నిమిషాలు ఒకే వైపుకు తిప్పుతూ కలపడం వల్ల గారెలు మెత్తగా వస్తాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను మధ్యస్థంగా ఉంచి, నెమ్మదిగా రెండు వైపులా తిప్పుతూ వేయించాలి.

మెత్తని రవ్వ కేసరి:రవ్వ కేసరి తక్కువ సమయంలో తయారు చేసుకునే మరో ప్రసాదం. చల్లారినా గట్టి పడకుండా, మృదువుగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసుకోవడం చాలా సులువు. ముందుగా, నెయ్యిలో రవ్వను దోరగా వేయించాలి. తర్వాత నీళ్లు, చక్కెర వేసి రవ్వను ఉడికించాలి. దీనికి ఫుడ్ కలర్, యాలకుల పొడి, జీడిపప్పులు, కిస్‌మిస్ అన్నీ వేసి , తర్వాత పై కొంచెం నెయ్యి వేయాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వ కేసరీ రెడీ.