- Telugu News Photo Gallery Spiritual photos TTD’s Black Gold Creates New Record..! How Many Devotees Donated Hair in May at Tirumala?
టీటీడీలో ‘నల్ల బంగారం’ కొత్త రికార్డు..! ఒక్క మే నెలలోనే తలనీలాలు ఇచ్చిన భక్తులు ఎంతమందో తెలుసా..?
Hair Donation Record in TTD: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల తలనీలాల సమర్పణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది మే 27 నాటికి ఏకంగా 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2024 మేలో 10,65,729 మంది, 2025 మేలో 10,18,370 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ రాత్రింబవళ్లు తలనీలాల సేవలను కొనసాగిస్తోంది.
Updated on: May 29, 2026 | 8:39 AM

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించే భక్తులు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. తలనీలాలు సమర్పించే సంఖ్య రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ ఏడాది మే నెలలో గణనీయంగా పెరగడంతో తిరుమలలో నల్ల బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. తలనీలాలు సమర్పించే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రాత్రింబవళ్లు నిరాటంకంగా తలనీలాల సమర్పణకు సేవలను అందుబాటులో తెచ్చింది. ఇందులో భాగంగానే మే 27 నాటికి, తిరుమలలో ఏకంగా 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2024, 2025 మే నెలలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో ఇప్పటి దాకా తలనీలాలు సమర్పించిన భక్తులు ఎక్కువే. 2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

వేసవి సెలవుల సీజన్ తోపాటు వారాంతాల్లో ఉండే నిరంతర రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి ఈ ఏడాది మే నెలలో భారీగా పెరిగింది . మే 18 నుండి మే 23 వరకు, వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

మే 23న ఒక్కరోజే భక్తులు మొక్కుల చెల్లింపులో రికార్డు బద్దలు కొట్టారు. ఆ ఒక్క రోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. తిరుమలలోని తలనీలాలు సమర్పించే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటుసౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది. తిరుమలలో చాలాచోట్ల కల్యాణకట్ట కేంద్రాలను ఏర్పాటు చేసిన టిటిడి ప్రధాన కల్యాణకట్టతో పాటు, PAC-1, PAC-2, PAC-3, PAC-5, GNC, HVC, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద 11 చిన్న తలనీలాల సమర్పణ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.

అంకితభావంతో క్షురకుల సేవలు.. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న క్షురకుల సంఖ్య 1,152గా ఉంది. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన తలనీలాల సమర్పణ సేవలను అందించడానికి TTD ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాధారణంగా ప్రతి బార్బర్ 6 గంటల షిఫ్టులో సుమారు 40 మంది భక్తులకు తలనీలాలు తీస్తారు. పెరిగిన యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ సుమారు 250 మంది క్షురకులను షిఫ్టులలో తలనీలాలు తీసే సమయాన్ని పెంచింది. దీనివల్ల ప్రతి క్షురకుడు సుమారుగా 50 మంది భక్తులకు అదనంగా సేవలు అందించగలుగుతున్నారు. దీంతో సేవలకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు.

పరిశుభ్రత ప్రాధాన్యత.. భక్తులు, క్షురకుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అన్ని కళ్యాణకట్ట కేంద్రాలలో పరిశుభ్రతకు, పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తోంది. తలనీలాలు తీయడానికి ఉపయోగించే బ్లేడ్లను మొదట సోడియం ద్రావణంలో స్టెరిలైజ్ చేసి, ఆ తర్వాత డెట్టాల్‌తో శుభ్రం చేసి వాడుతున్నారు. భక్తులు సమర్పించిన తలనీలాలు భద్రపరుస్తున్న టిటిడి ప్రతి కళ్యాణకట్టలో భక్తుల కోసం స్నాన సౌకర్యాలు, వేడి నీటి సదుపాయం కల్పించింది. తలనీలాలు తీసిన తర్వాత టీటీడీ భక్తులకు చందనం బిళ్ళలను కూడా పంపిణీ చేస్తోంది.

పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే అనుభూతిని అందించేందుకు, టిటిడి అన్ని తలనీలా కేంద్రాలలో పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, కూర్చునేందుకు ఏర్పాట్లతోపాటు టోకెన్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తోంది.
