
Tirumala Rush

శ్రీవారిని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయి కల్యాణ వేదిక వరకు భక్తుల క్యూ లైన్ ఉంది.

భక్తుల తాకిడి రద్దీ కొన సాగుతుండటంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. రూ.300 స్పెషల్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

గంటల తరబడి క్యూ లైన్ లలో కోనేటి రాయుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ ఎటువంటి ఇబ్బంది కలుగ కుండా తగిన సౌకర్యాలు కల్పిస్తోంది. శ్రీవారి సేవకుల సహకారంతో అన్నప్రసాదం, తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో టీటీడీ సీనియర్ అధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తోంది.

శుక్రవారం స్వామి వారిని 66,782 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,229 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.