
శ్రీనివాసుడు విశ్వ సుందరి మోహిని రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. మోహినీ అవతారం.. మాయా మోహ నాశనం. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని చాటి చెబుతున్నారని విశ్వాసం. విశ్వమంతా తన మాయ సృష్టి అని భక్తులకు సందేశం ఇస్తుంది. ఈ మాయను అధిగమించాలంటే అందరూ ఆయనను ఆరాధించాలి.

రంగురంగుల పట్టు వస్త్రాలు ధరించి, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి, చక్కగా అలంకరించబడిన పల్లకిపై కూర్చొని.. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు.

మోహిని అవతారంలో పక్కనే తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై నాలుగు మాడ వీధుల్లో గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాల నడుమ భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ దర్శనం ఇచ్చారు శ్రీవారు.

తిరుమల పీఠాధిపతులు, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, ఇతర ముఖ్య అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ రోజు రాత్రి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడసేవ ఉండనుంది. సాయత్రం ఆరున్నర గంటలకు ప్రారంభం కానున్న గరుడ వాహన సేవకు మూడున్నర లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు అంకిత భావంతో సేవలు అందించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.

సోమవారం రాత్రి 9 గంటల నుంచే తిరుమల ఘాట్ రోడ్డులో బైక్స్ లకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. మరోవైపు తిరుమలలో గ్యాలరీల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు వాహన సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

ఈరోజు ఉదయం 7 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు భక్తులకు అందుబాటులో అన్నదాన సత్రం ఉండనుంది. మరోవైపు తిరుమల కొండకు భక్తులను తరలించేందుకు 3 వేల ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది.

తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 28 భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసిన టిటిడి. కొండపై ఎక్కడున్నా భక్తులు గరుడసేవను తిలకించేలా ఏర్పాట్లు చేసింది. పోలీసు, టీటీడీ విజిలెన్స్, అక్టోపస్, బాంబ్ డిస్పోజబుల్ సిబ్బందితో కలిపి 7 వేల తో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలను ఆట కట్టించేందుకు సాంకేతికత ను వినియోగిస్తోంది టిటిడి. చిన్నారులు, వృద్ధులు, మానసిక వికలాంగులు తప్పిపోతే గుర్తించేందుకు 10 చోట్ల జియో ట్యాగింగ్ ను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ.