- Telugu News Photo Gallery Spiritual photos Sri venkateswara swamy brahmotsavam in Konaseema Tirupati Vadapalli, heavy rush
Konaseema Tirupati: కన్నుల పండువగా వాడపల్లి బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు.. భారీ సంఖ్యలో భక్తులహాజరు
కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి పదో వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తునారు. యాగశాలలో ప్రత్యేక హోమాలతో పాటు, వసంత మండపంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
Updated on: Oct 16, 2022 | 5:38 PM

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదా చార్యులు బ్రహ్మ త్వంలో వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఆలయాన్ని ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.

మొదటి రోజు స్వామివారికి తిరుమంజన సేవ, అకల్మష హోమం, నవమూర్తి అవాహన, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు పరావాసుదేవ అలంకరణతో శ్రీవారు శేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలంకరణలతో కూడిన భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయాన్ని ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.

16వ తేదీ ఆదివారం ఉదయం శ్రీనివాస కల్యాణం, రాత్రి కోదండరామ అలంకరణతో హనుమద్వాహన సేవ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. .

రేపు (7వ తేదీ సోమవారం) తోమాల సేవ, మహా సుదర్శన హోమం. యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ, కేరళ వాయిద్యం, గిరిజన సంప్రదాయ వాయిద్యం, దాండియా కోలాటం ఉంటుంది.

18వ తేదీ మంగళవారం అష్టదళపాదపద్మారాధన జరగనుంది. మలయప్ప అలంకరణతో గరుడవాహన సేవను నిర్వహించనున్నారు. కేరళ వాయిద్యం, కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

19వ తేదీ బుధవారం సుప్రభాత సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. లక్ష్మీవేంకటేశ్వర హోమం, మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహనసేవ, తెలంగాణ బోనాల కోలాటం, అన్నమయ్య సంకీర్తనలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

20వ తేదీ గురువారం తిరుప్పావడ సేవ, రాజాధిరాజ అలంకరణతో శ్రీవారికి గజ వాహన సేవ ఉంటుంది. వివిధ వాయిద్యాలు, ప్రదర్శనలు ఉంటాయి.

21వ తేదీ శుక్రవారం గోదావరి నదీ జల సంగ్రహణం, లక్ష కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, చూర్ణోత్సవం, కల్కి అలంకరణతో అశ్వ వాహన సేవ. కేరళ వాయిద్యాలు, డోలు సన్నాయితో పాటు మహారాష్ట్ర వాయిద్య కళాకారులతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు 22వ తేదీ శనివారం మహా పూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం, మహదాశీర్వచనం, ఏకాంత సేవ, మహారాష్ట్ర వాయిద్య కళాకారులు, కేరళ వాయిద్యం, డోలు సన్నాయిలతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.





























