గాలిగోపురానికి ఆనుకుని దేవాలయ ఆవరణలో రెండు శిలా శాసనాలు వున్నాయి. మొదటి శిలాశాసనాన్ని 1555లో వేయగా కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి 1558లో రెండవ శిలశాసనాన్ని వేయించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. విశిష్టమైన శిల్పసంపద, విశాలమైన మండపాలు ఎత్తైన గాలిగోపురాలు, విజయనగరరాజుల శిల్పనైపుణ్యం తెలిపే ఆనవాళ్లు ఈ ఆలయంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఆలయ ముఖ మండపంలో 11వ శతాబ్దం నాటి శిల్పకళ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిని బట్టి ఈఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దానికి పూర్తయినట్లు తెలుస్తోంది. మట్లిరాజులు , చోళులు, విజయనగర రాజులు, శిల్పకళానైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఆలయ ముఖమండపంలో రామాయమణం,భారతం, భాగవతం కథలను తెలిపే శిల్పాలు, వటపత్రసాయి బొమ్మలు, లంకకు వారధి నిర్మిస్తున్న వానరులు, సీతా దేవికి అంగుళీయానం చూపిస్తున్న ఆంజనేయస్వామి తదితర శిల్పాలు భక్తులను కట్టిపడేస్తాయి.