- Telugu News Photo Gallery Spiritual photos Samatha Kumbh Brahmotsavam photos on 13 02 2023 in Hyderabad Telugu spiritual Photos
Samatha kumbh 2023: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు..(ఫొటోస్)
నిన్న(12-02-2023) ప్రాతఃకాలంలో ఆచార్య సన్నిధిలో ఆచార్యులతో పాటు అంగన్యాసం, కరన్యాసం సహిత భగవత్ ధ్యానం, అష్టాక్షరి మంత్ర జప అనుష్ఠానంతో యాగశాలలో కార్యక్రమం ఆరంభమైంది.తరువాత పెరుమాళ్ల ఆరాధన..
Updated on: Feb 13, 2023 | 12:42 PM

నిన్న(12-02-2023) ప్రాతఃకాలంలో ఆచార్య సన్నిధిలో ఆచార్యులతో పాటు అంగన్యాసం, కరన్యాసం సహిత భగవత్ ధ్యానం, అష్టాక్షరి మంత్ర జప అనుష్ఠానంతో యాగశాలలో కార్యక్రమం ఆరంభమైంది.

తరువాత పెరుమాళ్ల ఆరాధన, సేవాకాలం, మంగళాశాసనములు, శాంతి పాఠం, వేద విన్నపాలు, వేద పారాయణములు వరుసగా కొనసాగాయి.

సమతా కుంభ్ మహోత్సవం అధికారికంగా నిన్నటి సాయంకాలం పూర్తయిందని. ఇవాళ మరికొన్ని కార్యక్రమాలు సాగుతాయి. తీర్థగోష్ఠి పూర్తవగానే హోమ కార్యక్రమాల పూర్ణాహుతి ఉంటుందని అన్నారు.

దివ్యసాకేత క్షేత్రంలోని రామచంద్రస్వామికి, సమతా మూర్తి సన్నిధిలోని మూలమూర్తికి ఉత్సవాన్త స్నపనము నిర్వహిస్తామని. ఇది ఒక అభిషేక మహోత్సవం అని చెప్పారు.

మధ్యాహ్నం 2 గంటల దగ్గరి నుంచి వేదికపై కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత యాగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసిన దేవతాగణానికి పూజా కార్యక్రమాలు ఉంటాయి.

రంగురంగుల పుష్పాలతో చక్రార్థ మండల రచన చేసి శ్రీపుష్ప యాగం జరుగుతుంది. తర్వాత ద్వాదశ ఆరాధన.. అంటే పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు జరుగుతాయి.

సుప్రభాతంనుంచి శయనోత్సవం వరకు 12 సార్లు జరిపిస్తారు. తర్వాత పెరుమాళ్లు యాగశాలకు వస్తారు. అక్కడ మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇదే చివరి ఆహుతి.

ఆవాహన చేసిన దేవతలందరికి ఆరాధన చేసి బలిహరణలు పూర్తయ్యాక దేవతా ఉద్వాసన చేస్తారు. కార్యక్రమాన్ని నడిపించిన గరుడ్మంతుడి దగ్గరికి వెళ్లి స్వామి ఆజ్ఞతో వారిని కిందకి దించుతారు.

గరుడ పట అవరోహణం జరుగుతుంది. మొట్టమొదట ఆవాహన చేసిన దేవతలందరినీ కలశంలో వేంచేయింపజేశారు. ప్రధాన కుంభాన్ని, దేవతలను తీసుకుని.. యజ్ఞ శేషాన్ని 108 దివ్యదేశాల్లో ఉండే స్వాములకు యజ్ఞరక్ష పెట్టి కుంభతీర్థంతో ప్రోక్షణ జరుగుతుంది.

తర్వాత స్వర్ణ రామానుజులవారి దగ్గర యజ్ఞ రక్ష, కుంభప్రోక్షణ జరుగుతుంది. అనంతరం పైన ఉండే సమతా మూర్తి దగ్గర కూడా ప్రోక్షణ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఆ తర్వాత ఆ శేష తీర్థాన్ని భక్తులకు ఇస్తారు.

కలశ తీర్థాన్ని తీసుకెళ్లి సాకేత క్షేత్రంలోని వైకుంఠనాథుడు, రంగనాథుడు, రఘునాథుడు, ఆంజనేయస్వామి, ఆళ్వార్లకు కూడా ప్రోక్షణలు చేస్తారు. ఆ తర్వాత ఆ తీర్థం కూడా ఇక్కడికి వస్తుంది.

ద్వాదశ ఆరాధన కార్యక్రమంలో 12 ప్రసాదాలు నివేదిస్తారు. ఆ ప్రసాదాలను భక్తుల హృదయాల్లో ఉండే స్వామి దగ్గరికి పంపిస్తే నివేదన పూర్తవుతుందని శ్రీ చినజీయర్‌స్వామి అన్నారు.
