
మేషం: రాశ్యధిపతి కుజుడితో పాటు నాలుగు గ్రహాలు మరో నాలుగైదు నెలల పాటు బాగా అనుకూల సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారు కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలతో సిద్ధంగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా అవకాశాలు పెరగబోతున్నాయి. స్వదేశీ అవకాశాలతో పాటు విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదరవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడితో పాటు గురువు, రవి, కుజులు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల అవసరమైతే మరింత మంచి సంస్థలోకి మారడానికి ఈ రాశివారు సిద్ధంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదరడానికి బాగా అవకాశం ఉంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకపోవడం మంచిది. ఆదాయం మార్గాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం.

కర్కాటకం: ఈ రాశికి దశమాధిపతి అయిన కుజుడు మిత్ర, ఉచ్ఛ స్థానాల్లో సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అనేక అవకాశాలు లభించడం జరుగుతుంది. వీరు ఏ అవకాశాన్నీ వదులుకోకపోవడం మంచిది. ఉద్యోగపరంగా అనేక అరుదైన అవకాశాలు లభిస్తాయి. ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు తనకు మిత్ర స్థానాలైన శని క్షేత్రాల్లో సంచారం చేయబోతున్నందువల్ల ఉద్యోగపరంగానే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ, ఆదాయపరంగానూ అనేక కీలకమైన అవకాశాలు అంది వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు వ్యాపారావకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టే పెట్టుబడులు అత్యధిక లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశా లకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో పాటు గురు, శుక్ర, రవులకు బాగా పెరుగుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది శ్రమతో, కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు మరింత మంచి ఉద్యోగంలోకి, ఉన్నత పదవిలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు లభించే సూచనలున్నాయి. కుజ, రవుల బలం కారణంగా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సరైన దిశలో ప్రయత్నాలు సాగించడం వల్ల ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది.

మకరం: రాశ్యధిపతి శనితో పాటు గురువు, శుక్రుడు, బుధ గ్రహాల బలం బాగా పెరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నా పురోగతికి అవకాశ ముంది.