
మేషం: ఈ రాశికి ప్రధానంగా రాశ్యధిపతి కుజుడు బలంగా ఉన్నందువల్ల లాభార్జన బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి సంబంధించి చేతికి అందిన అవకాశాలను వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపట్టి లాభాలు పొందు తారు. ఉద్యోగంలో సహోద్యోగులను మించిపోయి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. లాభదాయక ఒప్పందాలు కుదరడంతో పాటు లాభదాయక పరిచయాలు బాగా పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ధన స్థానంలో ప్రవేశించడంతో పాటు ధన స్థానాధిపతి రవి లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ విశేషంగా లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు అధికారులే కాక, బంధుమిత్రులు కూడా విలువనిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి వృద్ది చెందుతాయి.

సింహం: గ్రహాల మార్పువల్ల ఈ రాశివారు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. రవి, బుధ, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు, ఆశలను చాలావరకు సాధించుకుంటారు. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై, భూలాభం కలుగుతుంది.

తుల: ఈ రాశికి ఈ జ్యేష్ట మాసంలో నాలుగు గ్రహాల అనుకూలత కలుగుతుండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడానికి, మనసులోని కోరికలు నెరవేర్చుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.

వృశ్చికం: రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి జ్యేష్ట మాసంలో ఒకటి రెండు ధన యోగాలతో పాటు, అధికార యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత రిస్కు తీసుకుంటే ఆర్థికంగా అంత మంచిది.