
నవరాత్రులలో దుర్గా దేవి పూజ భక్తి కారణంగా సానుకూల వాతావరణం, మంగళకరమైన శక్తి ఇంటి చుట్టూ ప్రబలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రధాన ద్వారం వద్ద వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీ దేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

నవరాత్రులలో కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అని పురాణ గ్రంధాలతో పాటు జోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఈ నియమాలను పాటించి దుర్గాదేవిని పూజించే ఇంట్లో సుఖ సంతోషాలకు సిరి సంపదలకు లోటు ఉందని నమ్మకం. అంతేకాదు ఆ ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

నవరాత్రుల మొదటి రోజున పూజ ప్రారంభించే ముందు ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి ఆకులు, లేదా అశోక ఆకులతో తోరణం కట్టి అందంగా అలంకరించండి. ఇలా చేయడం ద్వారా ప్రధాన ద్వారం చుట్టూ ఉన్న ప్రతికూల, చెడు శక్తులన్నీ తొలగిపోతాయి.

నవరాత్రులలో పూజ గది నుంచి ప్రారంభించి ప్రధాన ద్వారం వద్ద తలుపుకు రెండు వైపులా సింధూరంతో స్వస్తిక్ గుర్తుని వేసి పసుపు కలిపిన నీటితో ఉన్న రాగి పాత్రను ద్వారం పక్కగా ఒక పువ్వు వేసి పెట్టండి.

నవరాత్రుల మొదటి రోజున ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లు ఇంట్లోకి అలా పుజ గది వరకూ దుర్గాదేవి పాదముద్రలను ముద్రించండి. ఇలా అమ్మవారి పాదాలను ముద్రించడానికి ఎరుపు రంగును ఉపయోగించడం మంచిది.

ఎప్పటి నుంచో డబ్బులకు ఇబ్బంది పడుతున్నా.. ఇంట్లో అశాంతితో ఉన్నా లేదా మీరు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోయినా నవరాత్రులలో లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్లి ఎర్రటి గుడ్డలో కొంత కుంకుమ, పసుపు, బియ్యం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం కొంచెం బియ్యాన్ని తీసుకొని ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో చల్లండి. ఇలా చేయడం ద్వారా ఆర్ధిక కష్టాలు తీరడం ప్రారంభమవుతాయి.

నవరాత్రుల తొమ్మిది రోజులు రోజువారీ పూజ చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన రాగి పాత్రను ఉంచి గులాబీ ఆకులు, కొద్దిగా పరిమళాన్ని అందులో కలపండి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

నవరాత్రులలో ఏ రోజైనా సరే ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.