
కుడుములు: గణేశుడి నైవేద్యం పెట్టె ఆహార పదార్ధాలలో తప్పనిసరిగా మోదకం అంటే కుడుములు ఉండాలి. పార్వతిదేవి తన బుజ్జి గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించిందని హిందువులు నమ్ముతారు. అప్పటి నుండి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశ పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు.

రంగుల ఎంపిక: సహజంగా మట్టి వినాయకుడుని పూజించడం అత్యంత శ్రేష్టం. అయితే రంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలుపు రంగు గణపతి విగ్రహాలు గృహాలకు ఉత్తమ ఎంపిక. తెలుపు రంగు శాంతి , స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది.

భంగిమను జాగ్రత్తగా చూసుకోండి: వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఈ భంగిమ విశ్రాంతి, శాంతిని అందిస్తుంది. ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

గణేశుడి తొండం: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమ వైపుకు వంగి ఉండే విధంగా చూసుకోండి. అటువంటి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని ఇస్తుంది.

గణేశుడిని ప్రతిష్టించే దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని ఇంటికి పడమర, ఉత్తరం , ఈశాన్య మూలల్లో ఉంచాలి. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేశ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉండాలి.