
పిచ్చుకలు గతంలో పంటచేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. ఇప్పుడు వాటి ఊసే కరువైంది. ఇళ్ళ ముంగిట్లో ఆహారం కోసం గుంపులుగా వాలడం, చిన్న అలికిడికే తుర్రుమనడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అలా ఎగిరే పిచ్చుకల విన్యాశాలు, దశ్యాలు చూడముచ్చటగా ఉంటాయి.

అయితే ప్రస్తుతం ఆ దృశ్యాలు కనుమరుగయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా పిచ్చుకల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి కాదు రెండు కాడు ఏకంగా వందల సంఖ్యలో పిచ్చుకలు ఆకాశంలో విన్యాశాలు చేస్తూ కనువిందు చేశాయి.

ఆటలాడుతున్నాయా, అన్నట్టుగా అల్లిబిల్లి ఎగురుతూ సందడి చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడురోజులుగా ముసురుపట్టి వాతావరణం చల్లగా ఉండటంతో పులకించిన పిచ్చుకలు ఈ విధంగా ఆనంద తాండవం చేసినట్టుగా కనిపించింది.

ప్రకాశంజిల్లా గిద్దలూరు సమీపంలో పక్షుల విన్యాసాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ పక్షుల గుంపు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసింది. దాదాపు గంటకు పైగా పక్షులు ఈ విధంగా విన్యాసాలు చేయడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పక్షి విన్యాసాలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన రేడియేషన్ వల్ల పక్షులు అంతరించిపోతుంటే ఇంత మొత్తంలో పక్షులు ఒక్కసారిగా కనిపించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చుక జాతికి చెందిన ఈ పక్షులు ప్రస్తుతం అతి తక్కువగా ప్రజలకు కనిపిస్తున్నాయని పక్షి ప్రేమికులు అంటున్నారు.