
నిమ్మరసం, కొబ్బరినీళ్లు, పెరుగు, పుచ్చకాయ వంటి ఎన్నో రకాల పానియాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ వీటిల్లో అత్యంత పోషకమైనది, ఆరోగ్యకరమైనది పెరుగు. వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా, శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి, హైడ్రేషన్‌ను నిరోధించడానికి, పొట్టను చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను బలోపేతం చేయడానికి పెరుగు ఉపయోగపడుతుంది.

ఇందులో తగినంత మొత్తంలో విటమిన్ డి, కాల్షియం ఉంటుంది. కాబట్టి వేసవిలో శరీరం చల్లగా ఉంచడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఎముకలను బలంగా కూడా ఉంచుతుంది. అందుకే చాలామంది వేసవిలో పెరుగు తినడానికి ఇష్టపడతారు. అలాగే వేసవిలో మజ్జిగ, లస్సీ తాగడం కూడా ఆరోగ్యకరం. కొంత మంది పెరుగును దుకాణంలో కొనుగోలు చేస్తే.. మరికొంత మంది ఇంట్లో పెరుగును తయారు చేస్తారు.

సైన్స్ ప్రకారం.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా పెరుగు రుచి మారుతుంది. దీంతో పెరుగు త్వరగా పుల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఇంట్లోనే పెరుగు చేసుకునేవారు ఇలా పుల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పగటిపూట పెరుగు చేయకూడదు. ఎప్పుడూ రాత్రిపూట పాలు కాగబెట్టి అందులో తోడువేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, పెరుగు పాడవదు. కాబట్టి పగటిపూట అస్సలు పెరుగు తయారు చేయకూడదు. పైగా వేసవిలో అధిక వేడి వల్ల పెరుగు సరిగ్గా గడ్డకట్టదు. రాత్రిపూట అయితే గడ్డపెరుగు తయారవుతుంది.

పెరుగు వెచ్చని ప్రదేశంలో పెడితే త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా లేదా ఫ్రిజ్‌లో ఉంచాలి. పెరుగు కుండను మట్టి కుండలో లేదా AC లేదా కూలర్ గదిలో ఉంచినా పాడవకుండా ఉంటుంది.