
ఎండాకాలంలో పాములు యాక్టివ్‌గా ఉంటాయి. ఆహారం కోసం, చల్లదనం కోసం అవి జనావాసాల్లోకి, ముఖ్యంగా చెట్లు, పొదలు ఉన్న తోటల్లోకి వస్తుంటాయి. అయితే కనిపించిన ప్రతి పాము విషపూరితమైనది కాదు. అవి మనకు తెలియకుండానే మన ఇంటి వద్ద ఎలుకలు, కీటకాలను తింటూ నిశ్శబ్ద కీటక సంహారకులుగా పనిచేస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో లేదా తోటలో పాము ఎదురైతే స్టాప్, ఫ్రీజ్, థింక్ అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

పామును కర్రతో కొట్టడం, రాళ్లు విసరడం లేదా వెంబడించడం వంటివి అస్సలు చేయకండి. పాములు స్వతహాగా దూకుడు స్వభావం కలవి కావు కానీ తమను తాము రక్షించుకోవడానికి దాడి చేస్తాయి. పాములు శబ్దాల కంటే ప్రకంపనలను వేగంగా గుర్తిస్తాయి. మీరు వేగంగా అడుగులు వేస్తే అది ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా నిశ్శబ్దంగా వెనక్కి జరగండి.

సురక్షితంగా ఎలా..?: పాముకు వెళ్లడానికి దారి ఇవ్వండి. మీరు సురక్షిత దూరం పాటిస్తే, అది తనంతట తానుగా వెళ్ళిపోతుంది. వీలైతే కిటికీలోంచి లేదా గేటు అవతలి నుండి అది ఎక్కడికి వెళ్తుందో గమనించండి. అది ఎక్కడ దాక్కుంటుందో తెలిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండవచ్చు. ఒకవేళ అది విషపూరితమైన పాము అని మీకు అనిపించినా, లేదా పదే పదే రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వస్తున్నా.. వెంటనే స్నేక్ క్యాచర్లను లేదా అటవీ శాఖ అధికారులను సంప్రదించండి.

పాములు రాకుండా ఎలా..?: పాములను ఆకర్షించే అంశాలను తగ్గిస్తే, అవి మీ తోటలోకి వచ్చే అవకాశం తక్కువ. తోటలోని గడ్డిని ఎప్పుడూ పొట్టిగా ఉంచండి. పొడవాటి గడ్డి పాములకు మంచి నివాసంగా మారుతుంది. పాత చెక్కల కుప్పలు, రాలిన ఆకులు, పనికిరాని వస్తువులను తొలగించండి. మీ తోటలో ఎలుకలు, కప్పలు తక్కువగా ఉంటే పాములకు ఆహారం దొరకదు, దాంతో అవి అక్కడ ఉండవు.

షెడ్లు లేదా ఇంటి పునాదుల దగ్గర ఉన్న ఖాళీలను, రంధ్రాలను సిమెంట్ లేదా మట్టితో మూసివేయండి. పాములు మన జీవావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. మనం జాగ్రత్తగా ఉంటూ వాటికి హాని చేయకుండా ఉంటే.. అవి కూడా మనకు ఎటువంటి హాని చేయవు.